వరికి ఉపయోగపడని రెయిన్‌గన్‌లు
మెట్టు, ఆరుతడి పంటలకే ప్రయోజనం
జిల్లాకు కేటాయించినవి–98, సరఫరా చేసినవి–65
రైతులకూ తప్పని నిర్వహణ భారం
అరకొరగా వచ్చిన వాటిని అనంతపురానికి తరలించాలని ఆదేశాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : నీటికోసం అల్లాడుతున్న పంటచేలకు ఊపిరిపోసే రెయిన్‌గన్‌లు జిల్లాకు అరకొరగానే వచ్చాయి. వచ్చినవాటిలో కొన్నింటిని అనంతపురానికి తరలించాల్సిందిగా ఆదేశాలందాయి. అనివార్యంగా నీరందించాల్సిన వరిపంటకు ఇవి ఎంతమాత్రం ఉపయోగపడవు. కేవలం మెట్టు... ఆరుతడిపంటలకే ప్రయోజనం. పైగా నిర్వహణ భారాన్నీ అన్నదాతలూ సగం మోయాలన్నది నిబంధన. నీటి వనరులు సమీపంలో లేని పంటపొలాలకు వీటిభారం మరింత పెరుగుతుందన్నది నిర్వివాదాంశం.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చెబుతున్న రెయిన్ గన్‌లతో జిల్లాలో ఎండిపోతున్న వరి పంటను సంరక్షించుకోవచ్చనుకుంటే తప్పులో కాలేసినట్టే. మెట్టు, ఆరుతడి పంటలకు మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. జిల్లాకు అవసరం మేరకు రెయిన్ గన్‌లు సరఫరా చేయలేదు సరికదా వచ్చినవాటిలో కొన్నింటిని అనంతపురానికి తరలించాలని తాజాగా ఆదేశాలిచ్చింది. పైగా జిల్లాలో వాటి నిర్వహణ ఖర్చుల్లో సగభాగం రైతులే భరించాలని షరతు పెట్టింది. మరి జిల్లాకు వాటివల్ల ప్రయోజనం ఏమిటన్నది సర్కారే చెప్పాలి.
ఆరు‘తడి’కోసమే...
జిల్లాలో లక్షా 97వేల 777హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో ఇంతవరకు లక్షా 40వేల 524హెక్టార్లలో మాత్రమే(71శాతం) సాగయింది. ఇందులో లక్షా 19వేల 089హెక్టార్ల వరి సాధారణ విస్తీర్ణంలో 81,322 హెక్టార్లలో మాత్రమే(68శాతం) సాగైంది. సాగైన వాటిలో 59,202హెక్టార్ల మేర మెట్టు, ఆరుతడి పంటలు ఉన్నాయి. సకాలంలో వర్షాలు పడకపోవడంతో వరిలో చాలా వరకు ఇప్పటికే పోయింది. ఈ నేపథ్యంలో మెట్టు, ఆరుతడి పంటలైనా రక్షించుకోవల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. ఆ ఉద్దేశంతోనే రెయిన్ గన్‌లను ప్రభుత్వం రంగంలోకి దించింది.
రైతుపైనే ఆర్థిక భారం
రెయిన్ గన్ వినియోగించాలంటే పక్కనే బోరుబావి, నూతులు, నీటికుంటలు, చెరువులు ఉండాలి. ఇవేవీ లేకపోతే సమీపంలోని నీటివనరులనుంచి పొలాల వద్దకు రవాణా చేయాలి. ఒక ఎకరాకు జీవతడి ఇచ్చేందుకు 15వేల లీటర్ల నీటిని మూడు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసుకోవాలి. అంత నీరు అందుబాటులో ఉంటేనే రెయిన్ గన్ ద్వారా నీటిని చిలకరించడానికి అవకాశం ఉంటుంది. నీరు రవాణా చేయాలంటే పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. ఈ రవాణా ఖర్చులో సగభాగం రైతులే భరించాలి. రెయిన్‌గన్ ద్వారా నీటిని చిలకరించేందుకు ఇంజిన్ అవసరం. దానికయ్యే ఆయిల్ ఖర్చునూ రైతులు సగం భరించాలి. ఈ లెక్కన రెయిన్ గన్ ద్వారా ఎండిపోతున్న జీవ తడి అందించాలంటే రైతులకు అదనపు భారం తప్పదు. ఇంత ఖర్చు పెట్టాక పంట చేతికొస్తుందో రాదో చెప్పలేం. అంటే రెయిన్ గన్‌ల రూపంలో రైతులపై ఆర్థిక భారం పడుతుందన్నమాట.
అవసరానికి తగ్గట్టు రాలేదు
అప్పో సప్పో చేసి ఎండిపోయిన పంటను తడిపించుకుందామనే రైతుల అవసరానికి తగ్గట్టుగా రెయిన్ గన్‌లు ప్రభుత్వం సరఫరా చేయలేకపోయింది. ఏదో ఆర్బాటానికి, ప్రచారానికే తప్ప ఇప్పుడున్న మెట్టు, ఆరుతడి పంటల విస్తీర్ణం ప్రకారమైతే 300వరకు రెయిన్ గన్‌లు అవసరం ఉంది. కానీ కేవలం 98 మాత్రమే ఇస్తామని ప్రకటించి, 65 సరఫరా చేసింది. ఒక రెయిన్ గన్‌తో ఎనిమిది గంటల వ్యవధిలో 10–12ఎకరాలకు మాత్రమే జీవతడి అందించవచ్చు. ఈ లెక్కన జిల్లాలో ఉన్న 59,202 హెక్టార్ల ఆరుతడి పంటలకు జీవతడి అందించాలంటే ఎన్ని రోజులు పడుతుందో అర్థం చేసుకోవచ్చు.
వచ్చినవాటినీ అనంతపురానికి...
అసలే జిల్లాకు అరకొరగా వచ్చాయని ఆవేదన చెందుతుంటే మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు వచ్చిన వాటిని అనంతపురం జిల్లాకు పంపించాలని ప్రభుత్వం తాజా ఆదేశాలిచ్చింది. జిల్లాకొచ్చిన వాటిని ఇంకా మండలాలకు పంపించనే లేదు... ఈలోపే వాటిని అనంతపురం తరలించాలని ఆదేశాలివ్వడంతో అధికారులు సందిగ్ధంలో పడ్డారు. జిల్లాలో అవసరం ఉందని, ఈ నేపథ్యంలో తరలిస్తే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవల్సి వస్తుందని మధనపడుతున్నారు.