
అర్ధరాత్రి ఎయిర్‌పోర్టులో వదిలేశాడు
• బిడ్డకు పాలు పట్టనివ్వకుండా వేధింపులు
• కట్నం కోసం భర్త, అత్త దాష్టీకం
• ఎన్‌ఆర్‌ఐ ఆవేదన
హిమాయత్‌నగర్: అదనపు కట్నం కోసం వేధించడమేగాకుండా, తనను వదిలించుకునేందుకు అర్ధరాత్రి పసిబిడ్డతో సహా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిర్ధాక్షిణ్యంగా తన భర్త తనను వదిలి వెళ్లాడని ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళ వాపోయింది.గురువారం బాలల హక్కుల సంఘం నేతలతో కలిసి వివరాలు వెల్లడించింది. వనస్థలిపురంకు చెందిన శిరీషను, రామంతపూర్‌కు చెందిన యలాల కీర్తిసాయిరెడ్డికి ఇచ్చి 2015జూన్‌లో పెళ్లి చేశారు. పెళ్‌లైన పదిరోజులకు భర్తతో కలిసి అమెరికాలోని వర్జినియాకు వెళ్లింది. కొద్ది రోజులకే భర్త కీర్తిసాయిరెడ్డి, అత్త వనిత నుంచి ఆమెకు వేధింపులు మొదలైయ్యాయి. పెళ్లి సమయంలో 36తులాల బంగారం, ఎకరం భూమి, వెండి, రూ.లక్ష నగదును ఇచ్చామని, అయినా తన అత్త వనిత అదనపు కట్నం కావాలని వేధించడమేగాక, భర్తను అందుకు పురిగొల్పేదన్నారు.
తన భర్త కీర్తిసాయి రెడ్డి ఇంట్లో సీసీకెమెరాలు అమర్చి తాను ఎవరితో మాట్లాడుతున్నానో, ఏం చేస్తున్నానో ప్రతిదీ గమనించి సాయంత్రం ఇంటికి రాగానే గొడవ పెట్టుకునేవాడన్నారు. పుట్టిన బిడ్డకు పాలు ఇస్తే తనకు దగ్గరవుతాడని, తన కుమారుడికి పాలుపట్టనిచ్చేవారు కాదన్నారు. అమెరికా నుంచి ఇండియాకు బయలుదేరిన తాము శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చే సరికి అర్థరాత్రి 2.30గంటలు అయ్యిందన్నారు. ఆ సమయంలో తనను, బిడ్డతో సహా ఒంటరిగా వదిలేసి తాను ఒక్కడే వదిలేసి వెళ్లాడని ఆవేదన వ్యక్తం చేసింది.చేతిలో రూపాయి లేక, ఫోన్ చేసేందుకు సెల్‌ఫోన్ లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న తనను గుర్తించిన ఓ ఏఎస్‌సై క్యాబ్‌లో కానిస్టేబుల్‌ను తోడుగా ఇచ్చి ఇంటికి పంపారని తెలిపింది. అచ్యుతరావు మాట్లాడుతూ పసికందు పట్ల రాక్షసంగా వ్యవహరిస్తున్న కీర్తిసాయిరెడ్డి, వనితలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు.