ఎన్టీఆర్ విద్యోన్నతి..అభ్యర్థులు అధోగతి
- రెండోవిడత ఎంపికపై నీలినీడలు!
- వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారికి మొండిచేయి
అనంతపురం ఎడ్యుకేషన్ : ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంపై ఆశలు పెట్టుకుని సివిల్స్ రాయాలనుకున్న చాలామంది అభ్యర్థులు కొందరు అధికారుల అలసత్వం కారణంగా అధోగతి పాలవుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు సివిల్ సర్వీసెస్‌కు సంబంధించి ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఆర్‌సీ రెడ్డి కోచింగ్ సెంటర్, బ్రెయిన్ ట్రీ, లక్ష్మయ్య కోచింగ్ సెంటర్‌తో పాటు బెంగళూరులోని యూనివర్సల్, ఢిల్లీలోని శ్రీరామ్స్ కోచింగ్ సెంటర్లలో ఉచితంగా తొమ్మిది నెలలపాటు శిక్షణ ఇప్పిస్తారు. నెలకు రూ.8 వేలు స్టైఫండ్ కూడా ఇస్తారు.
ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం–2016 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 700 మంది ఎస్సీ, 300 మంది ఎస్టీ అభ్యర్థులకు శిక్షణ ఇప్పించాల్సి ఉండగా, వీరిని ఎంపిక చేయడానికి కాకినాడ జేఎన్‌టీయూ యూనివర్సిటీ వారు ఆగష్టు 28న ఆన్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహించారు. 2వేల మందితో మెరిట్ లిస్టు తయారు చేశారు. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలనకు 1000 మంది అభ్యర్థులను పిలిచారు.
- హాజరైన వారిలో 137 (ఎస్సీలు 107, ఎస్టీలు 30) మంది ఇదివరకే శిక్షణ తీసుకున్నవారు కావడంతో అధికారులు వీరికి అవకాశం కల్పించలేదు. అయితే నోటిఫికేషన్‌లో ‘శిక్షణ తీసుకున్న వారు అనర్హులు’ అనే విషయాన్ని పొందుపరచక పోవడం వల్లే తాము పరీక్ష రాశామని, ఎంపికయ్యాక కాదంటే ఎలాగని వారిలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతానికి వారి సర్టిఫికెట్లను పరిశీలించాలని, తుది నిర్ణయం మేరకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో ఈ 137 మంది సర్టిఫికెట్లనూ అక్టోబర్ 5న పరిశీలించారు.
- మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలనకు 250 మంది దాకా గైర్హాజరు కాగా, వారి స్థానంలో వెయిటింగ్ లిస్టులో ఉన్నవారిని ఎంపిక చేసేందుకు అక్టోబర్ 14న వారి సర్టిఫికెట్లను పరిశీలించారు. దాదాపు ఎస్సీ విద్యార్థులు 200 మంది, ఎస్టీ విద్యార్థులు పదుల సంఖ్యలో హాజరయ్యారు. మూడు వారాలు గడిచినా వారికి ఓటీపీ(వన్ టైం పాస్‌వర్డ్) రాకపోవడంతో కోచింగ్‌కు వెళ్లలేకపోయారు. ఓటీపీ వస్తేనే ఆన్‌లైన్‌లో కోచింగ్ సెంటర్‌ను ఎంపిక చేసుకునే వీలుంటుంది.
2017 జూన్ 18న ప్రిలిమినరీ పరీక్ష
సివిల్ సర్వీసెస్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. యూపీపీఎస్సీ ప్రిలిమనరీ పరీక్ష 2017 జూన్ 18న నిర్వహించనున్నారు. శిక్షణ తొమ్మిది నెలలైతే పరీక్ష గడువు 7 నెలలు మాత్రమే ఉంది. ఇప్పటికే రెండు నెలల శిక్షణ కోల్పోయామని, వెంటనే రెండో జాబితాను ఖరారు చేసి శిక్షణకు పంపించాలని అభ్యర్థులు రాము, రుషికేష్, ముత్యాలప్ప, సాయినాథ్ తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రోశన్నను వివరణ కోరగా... ఎన్టీఆర్ విద్యోన్నతి పథకానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని, అంతా డైరెక్టరేట్ కార్యాలయం వారు, కాకినాడ జేఎన్‌టీయూ వారే చూస్తున్నారని ఆయన తెలిపారు.