ఆఫ్‌లైన్‌లోనే జేఈఈ అడ్వాన్స్‌డ్
♦ 2016 ప్రవేశాలకు పాత పద్ధతిలోనే పరీక్ష, ప్రవేశాలు
♦ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ విడుదల
♦ పూర్తిస్థాయి సిలబస్‌ను అందుబాటులో ఉంచిన గౌహతి ఐఐటీ
♦ ఏప్రిల్ 3న జేఈఈ మెయిన్ పరీక్ష, 27న ఫలితాలు
♦ ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్లు
♦ మే 11 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం, 22న పరీక్ష
♦ తెలంగాణ, ఏపీల్లో 5 కేంద్రాల్లో రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐఐటీల్లో 2016లో ప్రవేశాల కోసం ఈసారి ఆఫ్‌లైన్‌లోనే రాత పరీక్ష నిర్వహిస్తామని గౌహతి ఐఐటీ స్పష్టం చేసింది. అడ్వాన్స్‌డ్‌లో అబ్జెక్టివ్ విధానం రద్దు చేయాలన్న ఆలోచనలను పక్కనపెట్టింది. పాత పద్ధతిలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఉంటుందని వెల్లడి ంచింది. ఈ పరీక్షకు సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఇదివరకే పూర్తిస్థాయి షెడ్యూలును తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన గౌహతి ఐఐటీ ఇప్పుడు సిలబస్, పరీక్ష విధానం, పరీక్ష కేంద్రాల వివరాలు, పరీక్ష ఫీజు తదితర వివరాలను వెల్లడించింది. మరోవైపు జేఈఈ మెయిన్ ఆఫ్‌లైన్ పరీక్షను ఏప్రిల్ 3న, ఆన్‌లైన్ పరీక్షలను ఏప్రిల్ 9, 10 తేదీల్లో నిర్వహిస్తామని ఇప్పటికే సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) అడ్మిషన్ నోటీసు జారీ చేసింది. అయితే అందులో ఫలితాల వెల్లడి తేదీని ప్రకటించలేదు. పూర్తిస్థాయి సమాచారాన్ని డిసెంబర్ 1న ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో ప్రకటిస్తామని, అదే రోజు నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని పేర్కొంది. కాగా జేఈఈ అడ్వాన్స్‌డ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో జేఈఈ మెయిన్ పరీక్ష తేదీతోపాటు ఫలితాల ప్రకటన తేదీని కూడా వెల్లడించారు. జేఈఈ మెయిన్ ఫలితాలు ఏప్రిల్ 27న వెల్లడిస్తారు.
ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లోని ప్రధానాంశాలివీ...
► జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హులు. వారు 2016 ఏప్రిల్ 29 నుంచి ఆన్‌లైన్‌లో (www.jeeadv.ac.in) మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మే 11 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం.
► అడ్వాన్స్‌డ్ మే 22న ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపరు-2 పరీక్ష. ఈ రెండు పేపర్లను తప్పనిసరిగా రాయాలి. ఫలితాల వెల్లడి జూన్ 12న.
► పరీక్ష సమయానికి అరగంట ముందుగానే పరీక్ష హాల్లోకి చేరుకోవాలి. పరీక్ష ప్రారంభమయ్యాక హాల్లోకి అనుమతించరు.
► అంధులకు గంట సమయం అదనంగా ఇస్తారు. ఇందుకోసం జేఈఈ అడ్వాన్స్‌డ్ చైర్మన్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
►{పశ్నపత్రం ఇంగ్లిషు లేదా హిందీలో ఉంటుంది. విద్యార్థులు ఏ భాష అన్నది ముందుగానే ఎంచుకోవాలి.
► పరీక్ష ఫీజు కింద మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ. 1,000, ఇతర అభ్యర్థులు రూ. 2 వేలు, దుబాయ్‌లో పరీక్ష కేంద్రం కావాలనుకునే వారు 220 అమెరికా డాలర్లు చెల్లించాలి.
► ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు 12వ తరగతి/ ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైతే 70 శాతం మార్కులు సాధించాలి. లేదా ఆ బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిలో టాప్ -20 పర్సంటైల్‌లో ఉండాలి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు
తెలంగాణలో: హైదరాబాద్, వరంగల్
ఆంధ్రప్రదేశ్‌లో: విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడ.
ఆబ్జెక్టివ్ రద్దు పక్కకు...
ఆబ్జెక్టివ్ విధానం వల్ల ప్రశ్నపత్రంలో ఇచ్చే నాలుగు ఆప్షన్లలో (జవాబులు) ఏదో ఒక దానిని విద్యార్థులు ఊహించి సమాధానాన్ని టిక్ చేస్తుండటం వల్ల దానిపై పూర్తి అవగాహన ఉండటం లేదని, ప్రాబ్లమ్ సాల్వింగ్‌కు సంబంధించిన పూర్తి ఫార్ములా తెలియకుం డానే ఐఐటీల్లోకి వచ్చేస్తున్నారన్న భావన జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) ప్రతినిధు ల్లో నెలకొంది. అందుకే ఆబ్జెక్టివ్ విధానం రద్దు చేసి, ప్రశ్నపత్రంలో కేవలం ప్రశ్నలు మాత్రమే (నాలుగు ఆప్షన్లు ఇవ్వకుండా) ఇచ్చి జవాబును విద్యార్థే రాసేలా విధానం తీసుకురావాలని భావించారు. అయితే ప్రస్తుతానికి దానిని జేఏబీ పక్కనపెట్టింది.