తస్మాత్ జాగ్రత్త..!
♦ ఏజెన్సీలో అధ్వాన్నంగా పారిశుద్ధ్యం
♦ వ్యాధులు వ్యాపించే ప్రమాదం
♦డయేరియాతో వృద్ధురాలు మృతి
ఒకవైపు వర్షాలు, వరదలు. మరోవైపు చెత్తకుప్పలు, మురుగు నీరు. కనిపించని పారిశుద్ధ్య చర్యలు. పరిస్థితి ఇలా ఉంటే వ్యాధులు రాకుండా ఉంటాయా? ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి పరివాహక మండలాల ప్రజలకు కంటిపై కునుకు కరువైంది. ఈ వర్షాలతో వ్యాధులు ప్రబలుతాయేమోనని వారు భయపడుతున్నారు. వెంకటాపురం మండలం సూరవీడు కాలనీలో డయేరియాతో ఓ వృద్ధురాలు మంగళవారం మృతిచెందింది.
భద్రాచలం : ప్రస్తుత తరుణంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పంచాయతీ పాలకులు, అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గ్రామాల్లో ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చల్లించడంలో, తాగునీటి పథకాల్లో క్లోరినేషన్ చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గోదావరి వరదలతో కరకట్ట స్లూయిస్‌ల లీకేజీ కారణంగా భద్రాచలం పట్టణంలోని అశోక్‌నగర్ కొత్త కాలనీలోని ఇళ్లు రెండు రోజుల నుంచి నీట మునిగే ఉన్నాయి. పట్టణంలోని మురుగు నీరంతా కూడా ఇక్కడికే వస్తోంది. దీంతో కొత్త కాలనీ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. చెత్త కుప్పలు పేరుకుపోయాయి. వర్షాలతో అవి తడిచి దుర్గంధం వస్తోంది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఇండస్ట్రియల్ ఏరియా నుంచి కొత్త కాలనీకి వెళ్లే దారి చెత్త డంపింగ్ యార్డులా మారింది. వరద ముంపుతో బాధితుల పునరావాస శిబిరమైన సమీపంలోని పాఠశాల వద్ద కూడా పారిశుద్ధ్యం లోపించింది. భద్రాచలంలోని పంచాయతీ అధికారులు ప్రధాన రోడ్లపై తప్ప కాలనీలను పట్టించుకోవడం లేదని,పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం లేదని ఆయా కాలనీ వాసులు మండిపడుతున్నారు.
కలుషిత నీటితో అంటు వ్యాధులు
వాగులు పొంగి ప్రవహిస్తుండటం, ఓవర్ హెడ్ ట్యాంకులకు వెళ్లే పైపుల లీకేజీల కారణంగా తాగు నీరు కలుషితమయ్యే ప్రమాదముంది. ఏజెన్సీలోని అటవీ ప్రాంత గ్రామాల్లోని గిరిజనులు ఇప్పటికీ వాగుల నీటినే తాగుతున్నారు. ఈ నీరు ప్రస్తుతం కలుషితమైనందున డయేరియా వంటి వ్యాధులు విజృంభించే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భద్రాచలం పట్టణంలోని కొత్తకాలనీలో వైద్య శిబిరాన్ని పర్యవేక్షిస్తున్న ఎస్‌పీహెచ్‌ఓ డాక్టర్ కోమల ఇదే విషయం చెప్పారు. ‘‘చెత్తకుప్పలను తొలగించకపోతే దోమలు పెరిగి, మలేరియా జ్వరాలు వస్తాయి. మేము వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రయోజనం ఉండదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా ప్రాంతాలకన్నా కూడా మలేరియా, చికున్‌గున్యా, డెంగీ తదితర వ్యాధులు భద్రాచలం పట్టణంలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. అందుకే ఇక్కడి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముంది. గోదావరి వరదలు తగ్గుముఖం పట్టిన తరువాతనైనా పారిశుద్ధ్య నివారణ చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టకపోతే ప్రమాదం పొంచి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త..!
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి
అధికారులను ఆదేశించిన ఐటీడీఏ పీఓ రాజీవ్
భద్రాచలం : గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, తగిన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీఓ రాజీవ్ కోరారు. ఆయన మంగళవారం తన చాంబర్‌లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. పీఓ మాట్లాడుతూ.. గ్రామాల్లో సీజనల్ వ్యాధులైన మలేరియా, డయేరియా, డెంగీ వంటివి ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎస్పీహెచ్‌ఓలు క్లస్టర్ పరిధిలో, వైద్యాధికారులు మండల పరిధిలో రోజూ తరచుగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలన్నారు. ఐకేపీ, పంచాయతీ రాజ్, మంచినీటి సరఫరా విభాగాల సిబ్బందితో ప్రతి 15 రోజులకోసారి సమన్వయ సమావేశం నిర్వహించాలన్నారు.
క్షేత్రస్థాయి సిబ్బంది, ఏఎన్‌ఎమ్‌లు, ఆశా వర్కర్ల విధులను హెచ్‌ఈఓలు, సీహెచ్‌ఓలు, హెల్త్ సూపర్‌వైజర్లు పరిశీలించాలన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎమ్‌లు రెండు రోజులకోసారి ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు వైద్య సేవలు అందించాలన్నారు. సీజనల్ వ్యాధులతో ఎవరైనా మృతిచెందితే సంబంధిత వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎంఓ డాక్టర్ రాంబాబు, ఎస్‌పీహెచ్‌ఓ డాక్టర్ కోమల, ఏఎమ్‌ఓలు బన్సీలాల్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.