ఫిరాయింపులపై చట్టసవరణ అత్యవసరం
జన చైతన్యవేదిక సెమినార్‌లో పలువురు వక్తల సూచన
సాక్షి, విజయవాడ: పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు చేయడం అత్యవసరమని జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ నిర్వహించిన సెమినార్‌లో మాట్లాడిన వక్తలు సూచించారు. ప్రజాప్రతినిధులు ఫిరాయించిన వెంటనే పదవిపై వేటుపడాలని వారు అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని స్పీకర్ నుంచి ఈసీకి బదిలీ చేసేలా చట్టసవరణ జరగాలని సూచించారు. ‘పార్టీ ఫిరాయింపులు- ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై ఆదివారం విజయవాడలోని ఎంబీభవన్‌లో నిర్వహించిన ఈ సెమినార్‌లో సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి ప్రారంభోపన్యాసం చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చ ట్టంలో సవరణలు చేయాల్సిన అవసరముందన్నారు.
ఫిరాయింపులపై 1985లో, 2003లో చేసిన రెండు సవరణల్లోనూ లోపాలుండటం వల్ల మరోసారి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఇతర పార్టీలనుంచి గెలిచిన వారిని సీఎం స్వయంగా పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నారు. ఫిరాయింపుల విషయంలో స్పీకర్లు పార్టీలకతీతంగా వ్యవహరించి రాజ్యాంగస్ఫూర్తిని కాపాడాలన్నారు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణీత వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలనే నిబంధన పెట్టాలన్నారు. జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి, నాగార్జున వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ఎన్.రంగయ్య, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, నాగార్జున వర్సిటీ ఆచార్యుడు అంజిరెడ్డి, రిటైర్డ్ లెక్చరర్ ఎంసీ దాస్, సీనియర్ న్యాయవాది వై.కోటేశ్వరరావు తదితరులు మాట్లాడారు.