
ఆర్టీఏలో ఒకే కౌంటర్‌తో ఇక్కట్లు
అనంతపురం సెంట్రల్ : రోడ్డు రవాణా శాఖ(ఆర్టీఏ)లో నగదు రహిత లావాదేవీలతో శనివారం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రకరకాల సమస్యలతో వచ్చిన వాహనదారులందరికీ ఒకే కౌంటర్ ఏర్పాటు చేయడంతో డబ్బు కట్టేందుకు బారులు తీరారు. గంటల కొద్ది క్యూలైన్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం నుంచి రవాణాశాఖలో నగదు రహిత లావాదేవీలు ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రేషన్, డ్రైవింగ్‌లైసెన్స్, వాహనాలకు పన్నులు చెల్లింపులు తదితర వాటికోసం వందల మంది ప్రజలు శనివారం ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు.
అయితే ప్రస్తుతం కార్యాలయంలో ఒక్కటే స్వైప్ మిషన్ ఏర్పాటు చేశారు. వారం రోజుల క్రితం ఈ మిషన్‌ను తెప్పించారు. అన్ని పన్నులకు ఒకే స్వైప్‌మిషన్ ద్వారా చెల్లించాల్సి రావడంతో గంటల కొద్ది క్యూలైన్‌లో వేచి ఉండాల్సిన వచ్చింది. ఒక్కటే కౌంటర్ ఏర్పాటు చేయడంపై వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాహనదారుల అవసరాల దృష్ట్యా రెండు, మూడు స్వైప్‌మిషన్లు ఏర్పాటు చేయాలని, చిల్లర నోట్లు ఉన్న వారి నుంచి నగదు తీసుకోవాలని పలువురు వాహనదారులు కోరారు.
నగదు రహిత లావాదేవీల్లో రాష్ట్రంలో అగ్రస్థానం : డీటీసీ
రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్ ఆదేశాల మేరకు నగదు రహిత లావాదేవీలు 72శాతం సాధించి రాష్ట్రంలో జిల్లా అగ్రస్థానంలో ఉందని డీటీసీ సుందర్‌వద్దీ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం రూ. 3,15, 925లను వాహనదారులు ప్రభుత్వానికి చెల్లించగా అందులో రూ. 2,28,735లను(72) స్వైపింగ్ మిషన్ ద్వారా చెల్లించారన్నారు. ఈ నెలాఖరులోపు వందశాతం నగదు రహిత లావాదేవీలు చేపడుతామని వివరించారు.