బతుకమ్మ పేర్చేందుకు తామర పూలు తీసుకువచ్చేందుకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో మునిగి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా వెంకటాపురం మండలంలోని జవహార్‌నగర్‌లో చోటు చేసుకుంది.
వెంకటాపురం(వరంగల్): బతుకమ్మ పేర్చేందుకు తామర పూలు తీసుకువచ్చేందుకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో మునిగి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా వెంకటాపురం మండలంలోని జవహార్‌నగర్‌లో చోటు చేసుకుంది. స్థానికుడైన కుందె మల్లయ్య(42) ఇంట్లో బతుకమ్మ పేర్చేందుకు తామర పూలు తీసుకురావడం కోసం గండికుంట చెరువు వద్దకు పదకొండేళ్ల కుమారుడు నాగరాజుతో కలిసి వెళ్లాడు. చెరువులోకి దిగి పూలను కోస్తున్న క్రమంలో లోతు అంచనా వేయకపోవడం వల్ల మునిగిపోయాడు.
ఆ సమయంలో కుమారుడు నాగరాజు కేకలు వేసినా సాయం చేసేందుకు సమీపంలో ఎవరూ లేకపోవడంతో రాలేదు. దీంతో మల్లయ్య పూర్తిగా మునిగిపోయాడు. ఆయన కుమారుడు నాగరాజు ఇచ్చిన సమాచారంతో గ్రామస్తులు వెతకగా మల్లయ్య మృతదేహం లభించింది. మృతుడికి భార్య లక్ష్మితో పాటు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారని వెంకటాపురం ఎస్సై పోగుల శ్రీకాంత్ తెలిపారు.