
బాలిక అదృశ్యం కేసులో యువకుడు అరెస్ట్
- ఎట్టకేలకు కేసును ఛేదించిన పోలీసులు
- విలేకర్ల సమావేశంలో అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు
మైదుకూరు టౌన్: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని భూమాయపల్లెకు చెందిన విపురాపురం రాముడు తన కూతురు కనిపించలేదని మార్చి 23వ తేదీన మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన మైదుకూరు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు ఎట్టకేలకు అదృశ్యం కేసును ఛేదించారు. నిందితుని అరెస్టు వివరాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. రాయుడు కుమార్తె రామాంజనమ్మ(17) ఇంటర్మీడియట్ చదువుకుంటూ పట్టణానికి వస్తూ పోతుండగా విశ్వనాథపురం గ్రామానికి చెందిన పొట్టం సురేష్ అనే ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి మార్చి 22వ తేదీ రాత్రి బైక్‌లో తీసుకెళ్లాడు. సురేష్ ఎక్కడ ఉండేది ఎవ్వరికీ సమాచారం తెలియకూడదని సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.
బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వనిపెంట, గంజికుంట, జంగాళ్లపల్లె, బెంగళూరు, రాయచోటి తదితర ప్రాంతాల్లో వెతికినా ఎక్కడా సమాచారం లేదు. స్పెషల్ పార్టీ ఏర్పాటు చేసి కేసును ప్రత్యేకంగా పరిశీలించగా చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలో ఓ మామిడితోటలో ఉన్నట్లు సమాచారం రావడంతో కానిస్టేబుళ్లు ఇజ్రాయిల్, రాజేష్, సాగర్ బాలిక తల్లిదండ్రులను తీసుకొని వెళ్లి అదుపులోకి తీసుకున్నారన్నారు. బాలిక మైనర్ కావడంతో ఫోక్స్‌యాక్ట్ 2012, ఏపీసీ 366ఏ ప్రకారం కిడ్నాప్ కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు సీఐ తెలిపారు. అదే విధంగా మైనర్ బాలిక కిడ్నాప్‌నకు సహకరించిన వారిపై కేసు నమోదు చేస్తున్నామన్నారు. విలేకర్ల సమావేశంలో ఎస్‌ఐ ఎం.శాంతమ్మ, హెడ్‌కానిస్టేబుల్ గుర్రప్ప, రామసుబ్బారెడ్డి, తదితరులు ఉన్నారు.