రాజధాని గ్రామాల్లో రోగుల పాట్లు
* ఆస్పత్రి వరండాలోనే చికిత్స
* మూణ్ణాళ్ల ముచ్చటగా సీఆర్‌డీఏ మెగా వైద్య శిబిరాలు
* మాటలకే పరిమితమైన మంత్రి హామీలు
* అంబులెన్స్ సౌకర్యం లేక ప్రజల ఇక్కట్లు
తుళ్లూరు రూరల్: రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు. నవ్యాంధ్ర రాజధాని ప్రధాన కేంద్రమైన తుళ్లూరు మండల పరిధిలో డెంగీ, విషజ్వరాలు, అంటువ్యాధులతో జనం అల్లాడుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వ అధికారులు, పాలకులు సమీక్షలు, సమావేశాలు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బురదమయమైంది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం నుంచి బాలింతలకు కు.ని. (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్ చేసి వరండాలోనే వైద్యం అందిస్తున్నారు. వరండాలో ఉండటంతో రోగులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆపరేషన్ చేయించుకున్నవారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన వైద్య సిబ్బంది ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. ఆపరేషన్ చేసిన గంటల వ్యవధిలోనే వారిని ఇళ్లకు పంపేస్తున్నారు. గతంలో వైద్యశాఖకు సంబంధించిన ఆర్కిటెక్చర్ అధికారులు ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి పునర్నిర్మించాలని నివేదికలు ఇచ్చారు. ఇదే భవనంలో ఎక్కువlకాలం విధులు నిర్వహించటం మంచిది కాదని కూడా తేల్చిచెప్పారు. అయినా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టలేదు.
గ్రామాల్లో వైద్య శిబిరాలేవీ?
భూ సమీకరణ సమయంలో రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో సైతం ఉచిత వైద్యం అందిస్తామని పాలకులు ఇచ్చిన హామీలు నీరుగారిపోయాయి. గతంలో వ్యాధులు ప్రబలిన సమయంలో వైద్య శిబిరాలు నిర్వహించారు. ప్రజలతో అవసరం తీరిపోవటంతో నేడు గ్రామాల్లో వైద్యశిబిరాలు కరువయ్యాయి. అమరావతి రాజధాని అయిన ప్రాంతంలో కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో పేద, బడుగు వర్గాల వారికి అత్యవసర చికిత్స అవసరమైనప్పుడు అతి కష్టం మీద పెద్దాస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ కష్టాలు ఇంకెన్నాళ్లు?
తుళ్లూరు మండల ప్రజలకు వైద్యం అందించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని తేటతెల్లమవుతోంది. గతంలో మంత్రులు నారాయణ, పుల్లారావు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ప్రాథమిక వైద్యశాలను పరిశీలించినప్పుడు వెనువెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ను పిలిపించి పరిస్థితి వివరించారు. ఆ సమయంలో మంత్రి రూ.4.30 కోట్లతో 30 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని ప్రకటించారు. ఆ మేరకు 2016 ఏప్రిల్ 8న శంకుస్థాపన చేశారు. ఏడాదిలో కార్పొరేట్ స్థాయిలో ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. ఆరునెలలు గడచినా టెండర్లే పూర్తి కాలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తిచేయాలని, రాజధాని ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు.
కు.ని. కష్టాలు..
పాథమిక ఆరోగ్య కేంద్రంలోనే కుటుంబ నియంత్రణ చికిత్స కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం ఏఎన్‌ఎంలకు కేటాయించిన గదుల్లో కు.ని. శస్త్రచికిత్సలు నిర్వహించడంతో బాలింతలు అవస్థలకు గురవుతున్నారు. చిన్న గదుల్లో ఇటువంటి శస్త్రచికిత్సలు చేస్తే ఇన్ఫెక్షన్లు వస్తాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.