తుందుర్రును మరో నందిగ్రామ్ చేయొద్దు: పవన్
హైదరాబాద్: మెగా ఆక్వాఫుడ్ పార్క్తో జీవనదులు కాలుష్యమవుతాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ పెట్టడం సరికాదన్నారు. పంటలకు అనుకూలంగా లేని ప్రాంతాల్లోనే పరిశ్రమలు పెట్టాలని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలు రాష్ట్రానికి అన్నం పెడుతున్నాయని, సమ్యలు చెప్పుకునే అవకాశం బాధితులకు ఇవ్వాలన్నారు. లాభాలే లక్ష్యంగా నిబంధనలు ఉల్లంఘిస్తారా అని మండిపడ్డారు. రైతుల పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సూచించారు. తుందుర్రును మరో నందిగ్రామ్ చేయొద్దన్నారు. గంగా ప్రక్షాళణకు ప్రధాని నరేంద్రమోదీ నడుం కడితే బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు గోదావరిని కలుషితం చేస్తారా అని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తే శాంతియుత పోరాటం చేస్తామన్నారు. హైకోర్టు ఓ కమిటీని నియమించి అక్కడ పరిస్థితులపై చర్చించాలని సూచించారు. ఆక్వాఫుడ్ బాధితులకు జనసేన తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మెగా ఆక్వాఫుడ్ పరిశ్రమను సముద్రతీరానికి తరలించాలన్నారు. తాను భీమవరం వెళ్దామని అనుకున్నానని, అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వారినే ఇక్కడకు రప్పించానని పవన్ తెలిపారు.
అంతకు ముందు పశ్చిమ గోదావరి జిల్లాలోని మెగా ఆక్వాఫుడ్ ప్రాజెక్టు గ్రామాల రైతులు పవన్ కల్యాణ్తో సమావేశమయ్యారు. శనివారం మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతులు తమ సమస్యలను పవన్ దృష్టికి తీసుకువచ్చారు.
ఫ్యాక్టరీ వద్దని, తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు పవన్ను కోరారు. ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రెండున్నరేళ్లుగా ఉద్యమం చేస్తున్నామని, అన్యాయం గురించి ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత, పిల్లలు, మహిళలపై కేసులు పెడుతున్నారని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా రైతుల భూములు లాక్కొంటున్నారని, రైతులు వలస పోయే పరిస్థితి తీసుకువచ్చారని తెలిపారు.