నుడాలో ముసలం
►వైస్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న పెంచలరెడ్డి
►నెల రోజులుగా నడిచిన హైడ్రామా
►చైర్మన్ అనుచరగణం హడావుడితో ఆందోళన
►మంత్రి నారాయణపై ఒత్తిడి తెచ్చి మరీ పదవికి దూరం
►వైస్ చైర్మన్‌గా కమిషనర్ ఢిల్లీరావు నియామకం
►జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్
నెల్లూరు : నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (నుడా)లో అప్పుడే ముసలం మొదలైంది. కనీసం కార్యాలయం కూడా ఏర్పాటు కాక ముందే కీలక అధికారి వైస్ చైర్మన్ తప్పుకోవటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇంకా పూర్తిస్థాయిలో నుడా పట్టాలు ఎక్కకముందే జరుగుతున్న పరిణామాలను చూసి అధికారి తనవల్ల కాదంటూ వైదొలగారు. అది కూడా మంత్రి నారాయణను ఒప్పించి మరీ వైస్ చైర్మన్ పదవికి దూరమయ్యారు. ఈ వ్యవహారం ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే చైర్మన్‌తో బేధాభిప్రాయాలు వల్లే తప్పుకున్నాడని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది.
గత ఏడాది నవంబర్ 5న రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (నుడా)ని ఏర్పాటు చేస్తూ జీఓను వెలువరించింది. నెల్లూరు నగరం, గూడూరు, కావలి, నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీలు. అలాగే 21 మండలాల పరిధిలో ఉన్న 156 గ్రామాలను నుడా పరిధిలో చేర్చారు.
మొదటి నుంచి పెంచలరెడ్డి పర్యవేక్షణ
నుడా కార్యాచరణను నుడా వైస్ చైర్మన్‌గా నియమితులైన చల్లా పెంచలరెడ్డి మొదటి నుంచి పర్యవేక్షిస్తున్నారు. నుడాకు పరిపాలన భవనం, అవసరమైన సిబ్బంది, ఇతర అంశాలపై దృష్టి సారించారు. మున్సిపల్ శాఖ నుంచి కొందరు ఉద్యోగులను డిప్యుటేషన్‌పై నుడాకు తీసుకొచ్చి మొదట కార్యకలాపాలు మొదలుపెట్టాలని భావించారు. ఆ మేరకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు కూడా పరిస్థితిని నివేదించారు. అలాగే తాత్కాలిక కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది మే చివరి వారంలో నుడాకు పాలకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. చైర్మన్‌గా టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని నియమించి మరో ఆరుగురు సభ్యులతో బోర్డును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గత నెల 30వ తేదీన కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో పాటు మిగిలిన సభ్యులు అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా పెంచలరెడ్డే పర్యవేక్షించారు.
వాస్తవానికి రాష్ట్రంలోని అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలకు వైస్ చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ హోదా ఉండే ఐఏఎస్ అధికారిని నియమిస్తారు. అయితే నుడా కొత్తగా ఆవిర్భవించటంతో పూర్తి అనుభవం ఉన్న డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి పెంచలరెడ్డిని నియమించారు. సదరు అధికారి మంత్రి నారాయణకు అత్యంత నమ్మకస్తుడు కావటంతో మంత్రి ఓఎస్డీ బాధ్యతలతో పాటు వైస్ చైర్మన్‌గాను పనిచేశారు. ఈ క్రమంలో ఆయన తప్పుకోవటంపై అధికార పార్టీలోనే భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు, కావలి నుంచి తడ వరకు తమ పరిధిలో ఉంటుందని కొందరు అప్పుడే రియల్టర్లు, ఇతరుల వద్ద హడావుడి చేస్తున్నట్లు సమాచారం.
చైర్మన్, పాలకవర్గం రాకతో..
ఇదిలా ఉంటే పాలకవర్గం రావటంతో కొంత ఇబ్బందులు మొదలయ్యాయి. ముఖ్యంగా చైర్మన్ అనుచరగణం హడావుడికి వైస్‌చైర్మన్ కొంత ఇబ్బంది పడుతున్నారు. సర్వీసులో రిమార్కులు లేకుండా ఉన్న తనకు అనవసరమైన ఇబ్బందులు వస్తాయనే యోచనతో వైస్‌చైర్మన్ పదవి నుంచి తప్పించమని మంత్రి నారాయణను కోరినట్లు తెలిసింది. అయితే మంత్రి కొనసాగమని, ఇబ్బందులు ఉంటే పరిష్కరిద్దామని చెప్పినప్పటికీ కొందరితో మంత్రిపై ఒత్తిడి తెచ్చి మరీ తప్పుకున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల కిత్రం నగరపాలక సంస్థ కమిషనర్ ఢిల్లీరావును నుడా వైస్ చైర్మన్‌గా నియమించారు.