మీనం.. ఇక్కడ స్వల్పం...! | Pisces little here ! | Sakshi
Sakshi News home page

మీనం.. ఇక్కడ స్వల్పం...!

Published Sun, Jul 24 2016 10:54 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

మీనం.. ఇక్కడ స్వల్పం...!

మీనం.. ఇక్కడ స్వల్పం...!

  • కొర్రమేను పెంపకంలో జిల్లా వెనుకబాటు
  • అవసరంలో 20 శాతమే ఉత్పత్తి
  • ఏపీ నుంచి రోజుకు 600 కిలోల మేర దిగుమతి
  • రాష్ట్ర చేపగా ప్రకటించడంతో మత్స్యకారుల్లో ఆశలు
  •  పోచమ్మమైదాన్‌ : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం రాష్ట్ర చేపగా కొర్ర మేనును ప్రకటించింది. చేపల్లో రారాజుగా వెలుగొందే ఈ చేప తెలంగాణలో అత్యధికంగా లభిస్తుంది. ఈ చేపలతో వండే ఆహార పదార్థాలు రుచికరంగా ఉండడంతో వీటిపై ప్రజలకు మక్కువ. అదే తరహాలో ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే, మన జిల్లాలో కొర్ర మేను పెంపకం తక్కువేనని చెప్పాలి. కానీ ప్రస్తుతం రాష్ట్ర చేపగా ప్రకటించిన నేపథ్యంలో వీటి పెంపకానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని.. తద్వారా తమకు ఆదాయం పెరుగుతుందని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
     
    కొన్ని ప్రాంతాల్లోనే..
    కొర్ర మేను చేపలను రాష్ట్ర చేపగా ప్రకటించడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వీటి పెంపకం తక్కువే అయినా అభిమానులు మాత్రం ఎక్కువే. కావాల్సినంత మేర ‡పిల్లలు లభించకపోవడం, ధర కూడా ఎక్కువ కావడం.. ఇది మిగతా చేపలతో పోలిస్తే బరువు తక్కువగా పెరిగేది కావడంతో మత్స్యకారులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని సబ్సిడీపై పిల్లలు అందజేస్తే పెంపకానికి సిద్ధమేనని వారు చెబుతున్నారు.
     
    జిల్లాలోని రామప్ప, లక్నవరం, చలివాగు, ములుగు ఘన్‌పూర్, ధర్మసాగర్, మైలారం, అశ్వరావుపల్లి, ఘన్‌పూర్‌(స్టేషన్‌), రాజవరం, మల్లన్నగండి, ఏడునూతన బయ్యన్నవాగు, ఐనాపూర్‌ ప్రాంతాల్లోని చెరువుల్లో కొర్రమేను ఎక్కువగా పెంచుతున్నారు. ఆయా ప్రాంతాల్లో జిల్లా అవసరాలకు సంబంధించి 20 శాతం మేర మాత్రమే పెంపకం జరుగుతోంది. దీంతో అమ్మకందారులు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు తదితర ప్రాంతాల నుంచి రోజుకు 600 కిలోల వరకు దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా కొర్ర మేను ధర కిలో రూ.350 వరకు ఉంటుంది.
     
    చాలా మంచి పరిణామం
    కొర్రమేను చేపను రాష్ట్ర చేపగా ప్రకటించడం చాలా మంచి పరిణామం. ఈ చేప ప్రస్తుతం మన రాష్ట్రంలో అంతరించి పోయే దశలో ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో దీనిని కాపాడుకునేందుకు నిధులు విడుదల చేయడంతో పాటు కొన్ని చెరువులను ఈ చేపల పెంపకానికే కేటాయించే అవకాశముంది.
    – నరేష్‌ కుమార్‌ నాయుడు, ఎఫ్‌డీఓ వరంగల్‌
     
    పశ్చిమబెంగాల్‌ మాదిరిగా చర్యలు తీసుకోవాలి..
    పశ్చిమబెంగాల్‌లో ‘బెన్‌’ పేరిట అక్కడి ప్రభుత్వమే చేపల మార్కెటింగ్‌ చేస్తుంది. అలాంటి చర్యలు ఇక్కడ చేపడితే మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. ఆలస్యంగానే ప్రభుత్వం కొర్రమేనును రాష్ట్ర చేపగా ప్రకటించడం అభినందనీయం. ఇటీవల జమ్మికుంటలో జాతీయ ఫిష్‌ డెవలప్‌మెంట్‌ ఆధ్వర్యంలో కొర్ర మేను పెంపకంపై సదస్సు ఏర్పాటుచేశారు.
    – డాక్టర్‌ బండా ప్రకాష్, ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర నాయకుడు
     
    ఇప్పుడు ఇంకా డిమాండ్‌ పెరుగుతుంది...
    రాష్ట్ర ప్రభుత్వం కొర్రమేను రాష్ట్ర చేపగా ప్రకటించిన నేపథ్యంలో ఇంకా ఈ చేపకు డిమాండ్‌ పెరుగుతుంది. మన దగ్గర ప్రజలు ఈ చేపలను ఇష్టంగా తింటారు. అయితే, ప్రభుత్వం ఈ చేపల పెంపకానికి సీడ్‌ సబ్సిడీపై ఇవ్వడంతో పాటు కొన్ని ప్రత్యేక చెరువులను ఎంపిక చేస్తే బాగుంటుంది.
    – తత్తరి లక్ష్మణ్, గంగపుత్ర(బెస్త) గ్రేటర్‌ వరంగల్‌ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement