రైతుల జీవితాలతో ఆటలా?
– కాంట్రాక్టర్లపై జల్లా కలెక్టర్ ఆగ్రహం
– డిసెంబర్ చివరిలోగా హంద్రీనీవా
పనులు పూర్తి చేయాలని ఆదేశం
–పర్యవేక్షణకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు
కర్నూలు(అగ్రికల్చర్): ‘‘రైతుల జీవితాలతో ఆటలు ఆడుకుంటారా...మీ నిర్లక్ష్యంతో పత్తికొండ, దేవనకొండ మండలాల్లో రూ.500 కోట్ల విలువ చేసే పంట నష్టపోయారు.. దీనికి మీరే బాధ్యత వహించాలి’’ అంటూ కాంట్రాక్టర్లపై జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం కాన్ఫరెన్స్ హాల్‌లో హంద్రీనీవా సుజల స్రవంతి ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ 28,29 ప్యాకేజీలోని కుడి, ఎడమ కాల్వల పనులు వెంటనే ప్రారంభించి డిసెంబర్ నెల చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పర్యవేక్షణకు డిప్యూటీ కలెక్టర్లు..మల్లికార్జున, శశిదేవి, ఆదోని ఆర్డీఓ ఓబులేసులను నియమించారు. వీరికి 15 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 15 మంది రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు సహకారం అందిస్తారన్నారు. భూ సేకరణ కోసం రూ.65 కోట్లు కేటాయించామని.. ఇప్పుడు కారణాలు చెప్పడం సరికాదన్నారు. గతంలో చేసిన పనులకు రూ.5 కోట్ల బిల్లులు రావాల్సి ఉందని కాంట్రాక్టర్లు నివేదించగా ప్రభుత్వంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ముచ్చమర్రి ఎత్తిపోతల పథకం వచ్చే నెలలో పూర్తవుతుందని.. మార్చి నెల చివరికి నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నందున 28, 29వ ప్యాకేజి పనులను డిసెంబర్‌లోగా పూర్తిచేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, హంద్రీ నీవా సుజల స్రవంతి ఎస్‌ఈ నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.