ఎర్రవల్లి.. బంగారువల్లి
♦ డబుల్ బెడ్రూం ఇళ్లు బాగున్నాయి
♦ 12 ఎకరాల్లో ములుగులో ఉద్యాన యూనివర్సిటీ భవనాలు,
♦ మౌలిక సదుపాయాల కల్పన
♦ వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
జగదేవ్‌పూర్: సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లి త్వరలో బంగారువల్లిగా మారబోతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో డబుల్‌బెడ్రూం ఇండ్లు, కుంటల అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ముందుగా మంత్రి ఎర్రకుంటను పరిశీలించి ఆయకట్టు, నీటిసామర్థ్యం ఎంత ఉంటుందని సంబంధిత అధికారులను ఆడిగి తెలుసుకున్నారు. అనంతరం డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. నమూనా ఇంటిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటి లోపల కలియ తిరుగుతూ వసతులను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్‌బెడ్రూం ఇళ్లు చాలా చక్కగా ఉన్నాయని, పేదోళ్ల కలలు సాకారం కానున్నాయన్నారు. ఇళ్లను చూస్తుంటే కూకట్‌పల్లి గుర్తుకు వస్తోందన్నారు. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల ప్రజలు చాలా అదృష్టవంతులన్నారు. డ్రిప్పు, కూడవెల్లి వాగు పునరుద్ధణ పనులను మంత్రి పరిశీలించారు. కూడవెల్లి వాగు పనుల వివరాలను ఆడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు సీఎం ఫాంహౌస్‌లో టిఫిన్ చేసి వ్యవసాయ పనులను పరిశీలించారు.
రైతు గెటప్‌లో మంత్రి పోచారం..
ఎర్రవల్లిలో డబల్‌బెడ్రూం ఇళ్లను చూసిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటి ముగింట కూర్చొని అక్కడున్న వారిని పలకరించారు. ఆరుగు బాగుంది.. అంటూ అక్కడ కాసేపు కూర్చున్నారు. కొంత సేపు అధికారులతో మాట్లాడి సందర్శకుల పుస్తకంలో అభిప్రాయం రాశారు. రిజిస్టర్‌లో ఎర్రవల్లికి బదులు ఎర్రబల్లి అని రాశారు. పక్కనే ఉన్న అధికారులు ఎర్రవల్లి సారూ.. అంటున్నా మీకు తెలియదు.. అసలు పేరు ఎర్రబల్లి.. నాకు ముందే తెలుసు.. అంటూ బంగారువల్లి కావాలని అంకాక్షిస్తూ తన అభిప్రాయం రాశారు. కార్యక్రమంలో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రత్యేక అధికారి ప్రవీణ్‌రావు, గడా అధికారి హన్మంతరావు, సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, ఎంపీటీసీ భాగ్యమ్మ, వీడీసీ అధ్యక్షుడు కిష్టారెడ్డి, సభ్యులు కృష్ణ, సత్తయ్య, ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కేశినేని నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
ఉద్యాన పంటలకు ములుగు వర్సిటీ దోహదం
ములుగు : రాష్ట్రంలో ఉద్యాన పంటలకు ములుగు ఉద్యాన వర్సిటీ దోహదపడనుందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఐసీఏఆర్(ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్) మార్గదర్శకాల ప్రకారం ఇక్కడ భవన నిర్మాణాలు, రీసెర్చి కోసం తరగతిగదులు, ల్యాబ్‌లు నిర్మించనున్నట్లు తెలిపారు. మంగళవారం ములుగు మండల కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అక్కడ ఉద్యాన యూనివర్సిటీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. యూనివర్సీటీ అధికారులతో భవననిర్మాణాలపై చర్చించారు. 12 ఎకరాల్లో ఎక్కడ ఏ భవనం నిర్మించనున్నారో తెలియజేసే నమూనాను ఆయన విలేకరులకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యాన వవర్సిటీకీ కేంద్ర ప్రభుత్వం రూ.2 వందల కోట్లు ఇచ్చేందుకు అంగీకరించిందని, అందులో ఇప్పటికే రూ. 85 కోట్లు మంజూరు చేసిందని, ఈ ఏడాదికి మరో రూ.50 కోట్లు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు.
సాధ్యమైనంత వేగంగా ఇక్కడ ఉద్యాన నివర్సిటీ రూపుదిద్దుకోనుందన్నారు. రాష్ట్రంలో ఉద్యాన తోటలకు ఎంతో ప్రాధ్యాన్యత ఉందని, 18 లక్షల ఎకరాల్లో పండ్లతోటలు, 14 లక్షల ఎకరాల్లో కూరగాయలు, పూలతోటలు సాగవుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఉధ్యానవన శాఖ కమీషనర్ వెంకట్‌రాంరెడ్డి, రిజిష్టార్ ప్రతాప్, ప్రొఫెసర్ ప్రవీణ్‌రావు, డిప్యూటీ డెరైక్టర్ రామలక్ష్మి, సిద్దిపేట ఏడీహెచ్ సురేందర్, హార్టికల్చర్ అధికారి చక్రపాణి, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ మహ్మద్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.