
చేపల పెంపకంలో అక్రమాలకు చెక్
• మండలిలో పోచారం
• మత్స్య పరిశ్రమపై స్వల్పకాలిక చర్చ
సాక్షి, హైదరాబాద్: అక్రమాలకు తావు లేకుండా చేపల పెంపకానికి చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చెరువుల విస్తీర్ణాన్ని బట్టి చేప పిల్లలు వేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో అవకతవకలు సహించేప్రసక్తి లేదని స్పష్టం చేశారు. చేప పిల్లలు వేయడంలో అక్రమాలు జరగకుండా ఉండేందుకు గ్రామస్థాయిలో గ్రామ కార్యదర్శి, వీఆర్‌వో మరో ఇద్దరితో కమిటీలు వేశామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మధ్య దళారుల ప్రమేయం ఎక్కువగా ఉందన్నారు. ఆ వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వమే సొంతంగా చేప విత్తనాల ఉత్పత్తికి రూ. 34 కోట్లు వెచ్చించి, టెండర్లను పిలిచినట్లు చెప్పారు.
మంగళవారం శాసనమండలిలో ‘రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి’పై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ తరఫున పోచారం సమాధానమిచ్చారు. జిల్లాల్లోని అన్ని ప్రాంతాలలో కూడా మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు.. దీని కోసం అరవై కోట్లను కేటాయించినట్లు తెలిపారు. చేపలను అమ్ముకోవడానికి 70% సబ్సిడీతో వాహనాలు, టూ వీలర్స్ ఇస్తున్నామన్నారు. ద్విచక్రవాహనాలు పొందేందుకు మహిళలు కూడా అర్హులన్నారు. చేపలను భద్రపరిచేందుకు ఐస్ బాక్సులు, శీతల గిడ్డంగులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
చేపల విక్రయం, మార్కెటింగ్‌కు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థలాన్ని చూపితే జిల్లా, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, మేజర్ పంచాయతీల్లో ఎన్‌ఎఫ్‌డీసీ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపల మార్కెట్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అతి ముఖ్యమైనది మత్స్య పరిశ్రమ అని అన్నారు. గత ప్రభుత్వం 2013–14లో చేప పిల్లల పెంపకానికి రూ. కోటి మాత్రమే ఖర్చు చేసిందన్నారు. అందుకు పూర్తి భిన్నంగా తమ ప్రభుత్వం రూ. 29 కోట్ల విలువ చేసే చేపలను వంద శాతం సబ్సిడీతో అందజేస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేని విధంగా బడ్జెట్‌లో రూ.103 కోట్లు కేటాయించి, చేప విత్తనాల కోసమే రూ. 49 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు.
హైదరాబాద్‌లో ఆరు రిటైల్ మార్కెట్లు
హైదరాబాద్‌లో ఆరు రిటైల్ మార్కెట్లను, కరీంనగర్ జిల్లాలో హోల్‌సేల్, రిటైల్ మార్కెట్ కలిపి ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మార్కెటింగ్‌పై మహిళలకు శిక్షణను ఇస్తున్నట్లు తెలిపారు. ఈ చర్చలో పాల్గొన్న విపక్షనేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఒకే సమయంలో అసెంబ్లీ, మండలిలో ఒకేవిధమైన ప్రశ్న రాకుండా చూడాలని సూచించారు. చెరువుల్లో చేప పిల్లలు వేయడంలో అక్రమాలు జరిగాయని, పరిగిలోని చెరువులో 18 వేల చేప పిల్లలు వేశామని అధికారులు ప్రకటిస్తే అక్కడ మూడు వేలే వేసినట్లు తేలిందన్నారు.
ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయల అవినీతి జరిగినందున, దీనిపై విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. చేపల పెంపకంలో కాలుష్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి సూచించారు. చేపలు పట్టే ముదిరాజులు, గంగ పుత్రులకు పెన్షన్ ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. బులియన్ మార్కెట్ మాదిరిగా చేపల రేట్లకు సంబంధించి రోజువారీ ప్రకటనలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.