తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
భాగ్యనగర్ కాలనీ: తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కేపీహెచ్‌బీ సీఐ కుషాల్‌కర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట కోటిలింగాలకు చెందిన దేశెట్టి ఎల్లేష్(35) కుత్బుల్లాపూర్ భాగ్యలక్ష్మినగర్‌లో నివాసం ఉంటూ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వచ్చే ఆదాయం సరిపోక దొంగతనాల బాటపట్టాడు.
తాళాలు వేసి ఉన్న ఇళ్ల దగ్గర రెక్కీ చేసి రాత్రి, పగలు అనే తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. శనివారం ఉదయం నిజాంపేట రోడ్డు చౌరస్తాలో తనిఖీ చేపట్టిన పోలీసులకు ఎదురుపడటంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలను అంగీకరించాడు. కేపీహెచ్ బీలో నాలుగు, చందానగర్‌లో ఒకటి, మియపూర్‌లో ఒక చోరీ కేసులో నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. అతడి నుంచి ఏడు తులాల బంగారం, వెండి వస్తువులు, రెండు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. గతంలో పటాన్‌చెరువు, కేపీహెచ్‌బీ, దుండిగల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడి జైలు జీవితం అనుభవించాడు.