బీహారీ దొంగల అరెస్టు..రూ.7.65లక్షలు స్వాధీనం
Published Wed, Jan 18 2017 4:07 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
వరంగల్: అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తుల నుంచి పోలీసులు పెద్ద ఎత్తున నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఆర్‌ఎన్‌టీ రోడ్డులోని బంగారు దుకాణాల వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా రూ.7.65 లక్షల నగదు, 255 గ్రాముల బంగారం లభించింది.
ఇద్దరూ బీహార్‌లోని భగల్‌పూర్ నారాయణపూర్‌కు చెందిన ఇర్షాద్ అలీ, నజాం అలీలుగా తేలింది. కూలి పనుల కోసం వరంగల్‌కు వచ్చారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో బంగారం మెరుగుపెడతామని గ్రామాల్లో తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లను దోచుకునే వారు. గత ఏడాది దొంగతనాలకు పాల్పడి దోచుకున్న సొత్తును అమ్ముకునేందుకు బులియన్ మార్కెట్‌కు వస్తున్నట్లు అందిన సమాచారం మేరకు వలపన్ని దొంగలు పట్టుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ డేవిడ్ రాజు తెలిపారు. దొంగలను పట్టుకుని సొత్తును రికవరీ చేసిన సీసీఎస్ సిబ్బందిని సీపీ సుధీర్‌బాబు అభినందించారు.
Advertisement
Advertisement