
సారిక కేసు దర్యాప్తు వేగవంతం
వరంగల్ : అనుమానాస్పద స్థితిలో ముగ్గురు పిల్లలతో పాటు మృతి చెందిన సారిక కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత సిరిసిల్ల రాజయ్య నివాసాన్ని మరోసారి ఫోరెన్సిక్స్ నిపుణులు, పోలీసులు శుక్రవారం పరిశీలించారు. సారికతో పాటు ముగ్గురు చిన్నారుల సజీవ దహనమైన ఘటనలో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికే కీలకంగా మారనుంది.
సారిక ఆత్మహత్య చేసుకుందా లేక హత్యకు గురయ్యిందా అనే అంశం నిర్ధారించడంలో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికే ముఖ్యమని చెప్పొచ్చు. దీంతో పోస్టుమార్టం నిర్వహించిన సమయంలో వెలుగు చూసిన అంశాలు, మృతదేహాల భాగాలను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించనున్నారు.
వీటిని పరిశీలించాక ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక పంపిస్తే తప్ప సారిక, ఆమె కుమారులది హత్యా, ఆత్మహత్యా అనేది ధృవీకరించడం సాధ్యం కాదని పోలీసులతో పాటు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక సారికతో పాటు ముగ్గురు చిన్నారులు మంగళవారం రాత్రి తీసుకున్న భోజనంలో ఏమైనా మత్తు పదార్థాలు కలిశాయా అనే కోణంలోనూ పోస్టుమార్టం సందర్భంగా నిపుణులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
కాగా నలుగురి మృతికి కారణమైన భారీ మంటలు ఎలా వ్యాపించాయనేది ఈ కేసులో మిస్టరీగా మారింది. హన్మకొండ రెవెన్యూ కాలనీలోని రాజయ్య స్వగృహంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన సజీవ దహనం ఘటనకు సంబంధించి నాలుగు మృతదేహాలకు గురువారం ఉదయం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.