అత్తింట్లో నరకం | congrsss leader siricilla rajaiahs daughter in law sarika email unreliable facts | Sakshi
Sakshi News home page

అత్తింట్లో నరకం

Published Fri, Nov 6 2015 1:04 AM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM

అత్తింట్లో నరకం - Sakshi

అత్తింట్లో నరకం

తన లాయర్‌కు పంపిన ఫిర్యాదు లేఖలో సారిక గోడు
* అత్తామామ, భర్త కలసి తీవ్రంగా వేధించారు
* అడుగడుగునా అవమానాలే..
* భర్త బలాదూర్‌గా తిరిగాడు.. నా డబ్బులన్నీ వాడుకున్నాడు
* వివాహేతర సంబంధంపై ప్రశ్నిస్తే కొట్టేవాడు
* పిల్లల్ని ఏనాడూ పట్టించుకోలేదు.. పాల డబ్బాలు కొనాలన్నా ఇబ్బందే
* వంటగదికి తాళం వేసేవారు.. పస్తులు అలవాటైపోయాయి
* భర్త కోసం త్యాగాలు చేయాలని రాజయ్య అనేవారు
* ఆయన మాటలకు చచ్చిపోవాలనిపించేది
సాక్షి, హన్మకొండ: ప్రేమ పేరుతో సారిక జీవితంలోకి ప్రవేశించిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనిల్ అనుక్షణం ఆమెకు నరకాన్ని చూపించాడు.

భర్తగా కష్టసుఖాల్లో తోడుండాల్సిన వ్యక్తి బాధ్యతలను గాలికొదిలి బలాదూర్‌గా తిరిగాడు. సారిక కష్టార్జితాన్ని ఇష్టారీతిగా వాడుకుంటూ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. తప్పు దారిలో వెళ్తున్న కొడుకును మందలించాల్సిన తల్లిదండ్రులు కూడా ఆయనకే వత్తాసు పలికారు. సూటిపోటి మాటలు, భౌతిక దాడులతో సారికకు అనుక్షణం నరకం చూపించారు. భర్త, అత్తమామాలు పెడుతున్న ఇబ్బందులను తన తరఫున న్యాయవాదికి, షాహిన్స్ ఉమెన్ ఆర్గనైజేషన్‌కు పంపిన ఫిర్యాదు లేఖలో సారిక పూసగుచ్చినట్టు వివరించింది. ఆ వివరాలివీ..
 
నా కొడుకును పెళ్లి చేసుకో..
అనిల్, నేను ఉద్యోగాలు తెచ్చుకుంటే మా వాళ్లను, అనిల్  కుటుంబీకులను ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్నా. పెళ్లికి ముందు మా అత్తగారు మాధవి నన్ను తన కాలేజీకి (కేయూలో పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో) తీసుకెళ్లి మాయ మాటలు చెప్పింది. నన్ను మా అమ్మవాళ్ల ఇంట్లోంచి బయటకొచ్చి, వాళ్ల అబ్బాయిని పెళ్లి చేసుకోమని చెప్పింది.

చదువుకున్న వ్యక్తి, లెక్చరర్, మంచీచెడు అన్ని తెలిసిన పెద్దావిడ అని తల్లిలా భావించాను. ఆమె చెప్పినట్లే ఇంట్లోంచి వచ్చేసి అనిల్‌ను పెళ్లి చేసుకున్నా. ఆవిడ మాటలు విని చాలా పెద్ద తప్పు చేశాను. ఘోరమైన తప్పుడు స్టెప్ వేశాను. ఒక తప్పుడు నిర్ణయంతో జీవితం ఎలా నాశనం చేసుకుంటామన్నదానికి నా జీవితమే పెద్ద ఉదాహరణ. నా భర్త ఇంట్లో ప్రతీ క్షణం నన్ను అవమానించాడు. నా కష్టార్జితాన్ని వాడుకున్నారు. నన్ను, నా పిల్లలను పట్టించుకోలేదు.

పిల్లలకు వ్యాక్సిన్ వేయించేందుకు ఆస్పత్రికి వెళ్లడం నాకో పెద్ద పరీక్ష. ఇంట్లో మూడు కార్లు ఉన్నా.. ఒక్కటీ తీసేవారు కాదు. చివరికి పాల డబ్బాలు, మందులు కొనడం కూడా ఇబ్బందిగా ఉండేది. ఇంట్లో వంటగదికి తాళం వేసేవారు. వండిన వంటలో అడుగుకు మిగిలినవే నాకు నా బిడ్డలకు దక్కేవి. రెండోసారి గర్భిణిగా ఉన్నప్పుడు ఇంట్లో అన్ని గదులకు తాళం వేసి నన్ను హాల్లోనే ఉంచేవారు. బాత్రూమ్‌కి వెళ్లడం కష్టంగా ఉండేది. బట్టలుతికే స్థలంలో స్నానం చేయాల్సి వచ్చేది.

పెద్ద పొట్టతో హాల్‌లో నేను ఇబ్బంది పడుతుంటే ఇంట్లోకి వచ్చిన అత్తామామలు.. పెద్దవాళ్లు వచ్చినప్పుడు లేచి నిలబడాలని తెలియదా? అంటూ తిట్టేవాళ్లు. ఇద్దరు కవల పిల్లలు పుట్టాక పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. పాలు, సెరిలాక్ డబ్బా కొనడానికి కూడా నేను ఇబ్బంది పడాల్సి వచ్చేది.
 
పస్తులు కామన్ అయ్యాయి..
అనిల్‌తో 2006లో జరిగిన పెళ్లితో నా నరకప్రాయమైన జీవితం మొదలైంది. ఇంట్లో ఎవరూ నన్ను తిన్నావా? అని అడిగేవారు కాదు. అన్నానికి కూడా పిలిచేవారు కాదు. పస్తులు ఉండటం కామన్ అయిపోయింది. నా డబ్బులు రూ.20 లక్షలు, 10 తులాల బంగారం అంతా వాళ్ల దగ్గరే ఉంది. మా అమ్మ వాళ్లతో మాట్లాడేప్పుడు ఫోన్ లౌడ్ స్పీకర్ ఆన్ చేయమనేవాడు. కాల్‌లాగ్ చెక్ చేసేవాడు.

మీ చెల్లెలితో మాట్లాడావా.. అంతసేపు ఏం మాట్లాడావు? అంటూ ఆరా తీసేవాడు. ఇదీ అని చెబితే, నాకు చెప్పింది 5 నిమిషాలే కదా.. మిగతా 25 నిమిషాలు ఏమి మాట్లాడావని అడిగేవాడు. ఇలాంటివెన్నో భరించాను. ఎక్కడా ఎప్పుడు ఎవరితో చెప్పుకునేదాన్ని కాదు. మా అమ్మవాళ్లతో కూడా ఏమీ చెప్పలేదు. పెళ్లైనప్పట్నుంచీ అనిల్ ఇంతవరకు ఒక్క పని చేయలేదు. జాబ్ చేయమని ఎంతో నచ్చ చెప్పేదాన్ని. రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం, ఇంటర్వ్యూ తేదీలు ఇలా ఏ టూ జడ్ పనులు చేసినా ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉండేవాడు.

మా అత్తమామలు తలచుకుంటే ఏదైనా మంచి బిజినెస్, జాబ్ పెట్టించి ఉండొచ్చు. కానీ ఏదీ చేయలేదు. 2007 నుంచి 2010 వరకు కలకత్తా, ముంబై, పుణేలో మూడేళ్లు జాబ్ చేశాను. ఆ సమయంలో ఏటీఎం అనిల్ దగ్గరే ఉండేది. సేవ్సింగ్స్ లేకుండా డబ్బులన్నీ వాడుకున్నాడు. 2010లో పుణేలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చాక తెలిసింది అతనికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని.

ముందుగా ఒప్పుకోలేదు కానీ తర్వాత ఒప్పుకున్నాడు. తప్పులను ప్రశ్నిస్తే చాలు.. నాపై చేయి చేసుకునేవాడు, ఒకసారి నా జుట్టు పట్టుకుని నన్ను విసిరేస్తే, మంచం చివర తగిలి పెద్ద గాయమైంది. అత్తామామకు ఈ విషయం చెబితే పట్టించుకోలేదు సరికదా అనిల్‌కే మద్దతుగా నిలిచారు.
 
అత్త పచ్చి బూతులు తిట్టేది
అత్త మాధవి ఈసడింపు మాటలు, బూతులు, చిన్నదానికీ పెద్ద దానికీ వంకలు పెడుతూ తిట్టేది. చీటికీమాటికీ ‘నా మోచేతి నీళ్లు తాగి బతుకుతున్నావు. బయటకు పంపేస్తాను. గేట్ బయట నించోని మాట్లాడు. పచ్చి బూతులు తిట్టేది. మా మామయ్య, నా భర్త ఏనాడూ ఆవిడను అడ్డుకునేవారు కాదు. ఒకసారి మా అమ్మ నాకు చీర పెట్టింది.

ఆ చీర చూసి, నానా రభస చేసి ‘ఎవడేమీ ఇచ్చినా ఇలాగే తీసుకో’ అంటూ ద్వంద్వార్థాలతో మాట్లాడింది. ‘ఇప్పటికిప్పుడు నువ్వు ఇంట్లోంచి వెళ్లిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు’ అంటూ నాపైకి వచ్చేసి, వస్తువులు మీదకు విసిరేసి, చేయి చేసుకుని ఇంట్లోంచి గెంటేసింది. నాలుగు జతల బట్టలు తీసుకుని వెక్కివెక్కి ఏడ్చుకుంటూ వెళ్లిపోయాను. అనిల్ కూడా వాళ్లమ్మకే వంత పాడేవాడు.
 
త్యాగం చేయాలన్న మామ
కుటుంబ పెద్దగా మామయ్య సిరిసిల్ల రాజయ్య ఏనాడూ నాకు అండగా నిలవలేదు. ‘‘ఎంతో మంది మహిళలు భర్త కోసం, భర్త కుటుంబం కోసం త్యాగాలు చేస్తున్నారు. నువ్వు కూడా త్యాగం చేయాలి’’ అని అనేవాడు. పనివాళ్లు, పార్టీ కార్యకర్తల ముందే ఇష్టం వచ్చినట్టుగా గట్టిగా తిట్టేవాడు. దీంతో పైప్రాణం పైనే పోయేది. ఆ మాటలకు ఒక్కోసారి చచ్చిపోవాలనిపించేది. మామయ్య నా పేరు మీద నా అకౌంట్‌లో రూ.8 లక్షలతో కార్ లోను తీసుకున్నాడు. చేతిఖర్చులకు నా డబ్బులు వాడుకునేవాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement