
కన్నీటి ’సారిక’లు!
పోచమ్మమైదాన్: అశ్రునయనాల మధ్య వరంగల్‌లో మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, మనవళ్ల అంత్యక్రియలు ముగిశాయి. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని పోతన శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేశారు. గురువారం మధ్యాహ్నం ఎంజీఎం ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తరుున తర్వాత ఆస్పత్రి నుంచి శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు. మహిళలు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. రాజయ్య కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలి.. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలి అని నినదించారు.
సాయంత్రం 5.15 గంటలకు సారిక చితికి తల్లి లలిత నిప్పంటించారు. తర్వాత అభినవ్, శ్రీయాన్, అయాన్ మృతదేహాలను ఖననం చేశారు. మనవళ్లను ఖననం చేశాక లలిత బిగ్గరగా రోదిస్తూ కుప్పకూలిపోయింది. అంత్యక్రియలలో సారిక సోదరి అర్చన, కుటుంబ సభ్యులు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి, మహిళా సంఘం నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ఎంజీఎం ఆస్పత్రి మార్చురీ వద్ద సారిక తల్లిని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పరామర్శించారు. సారిక మృతిపై సీబీఐ విచారణ చేరుుంచాలని ఆయన డిమాండ్ చేశారు.