మాకు తెలియకుండా బదిలీలా?
Published Sat, Aug 20 2016 4:37 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
ఎస్సైల బదిలీలపై రాజకీయ నాయకుల ఆగ్రహం
తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు
రిపోర్ట్ చేయకూడదని శిక్షణ ఎస్సైలకు మౌఖిక ఆదేశాలు
వివాదాస్పదంగా మారుతున్న ప్రక్రియ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో 11 మంది ఎస్సైల బదిలీలకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైలను ప్రాధాన్యతగల పోలీస్ స్టేషన్‌లకు బదిలీ చేయడం, ఆయా స్థానాల్లో ఉన్న వారిని వీఆర్‌కు పంపడం కొందరు అధికార పక్షం నేతలకు మింగుడుపడడం లేదు. పోలీస్ ఉన్నతాధికారులు తమ సొంత నిర్ణయంతో పోస్టింగ్‌లు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని నేతలు.. అధికారుల తీరుపై భగ్గుమన్నట్లు తెలిసింది. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా బదిలీలు చేపట్టడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయడంతో బదిలీలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైలకు పోస్టింగ్‌లు ఇస్తూ ఇప్పటివరకు ఆయా స్టేషన్‌లలో విధులు నిర్వహించిన ఎస్సైలను వీఆర్‌లో ఉంచారు. బదిలీ అయిన ఎస్సైలు వెంటనే తమకు కేటాయించిన పోలీస్ స్టేషన్‌లలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. అయితే తమకు ఇతర పోలీస్ స్టేషన్‌లలో పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేకెన్సీ రిజర్వులో ఉంచడంపై పలువురు ఎస్సైలు మానసికంగా కుంగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో తమకు గతంలో పోస్టింగ్‌లు ఇప్పించిన నేతలను ఆశ్రయించారని సమాచారం. అటు వీఆర్‌లో ఉన్న ఎస్సైలు ఒత్తిడి తీసుకురావడం, ఇటు తమ మాట చెల్లుబాటు కాకపోవడంతో అధికార పక్షానికి చెందిన ముఖ్యనేతలు పోలీస్ ఉన్నతాధికారులపై సీరియస్ అయినట్లు తెలిసింది. దీంతో బదిలీలను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. శిక్షణ పొందిన ఎస్సైలు ఆయా స్టేషన్‌లలో రిపోర్ట్ చేయడానికి ముందు జిల్లా బాస్‌ను కలవాలని క్యాంప్ కార్యాలయం నుంచి సమాచారం అందడంతో.. శుక్రవారం పొద్దుపోయేవరకు శిక్షణ ఎస్సైలు క్యాంపు కార్యాలయం పరిసరాల్లో వేచి ఉన్నారు.
పుష్కర విధుల్లో ఉంటూనే చక్రం తిప్పిన ఎస్సైలు!
కృష్ణ పుష్కరాల్లో భాగంగా నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎస్సైలు కొందరు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. తమ బదిలీల సమాచారం తెలుసుకున్న ఎస్సైలు పుష్కరాల విధులు నిర్వహిస్తూనే అక్కడి నుంచి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. తమకు అండగా ఉన్న అధికార పక్షం నేతలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. వీఆర్‌కు బదిలీ అయిన ఎస్సైలు చక్రం తిప్పడంతో బదిలీలకు తాత్కాలిక బ్రేక్ పడింది.
Advertisement