
గత్యంతరం లేకనే వాయిదా: కోడెల
శాసనసభ శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుతో బాధ కలుగుతుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు
గుంటూరు వెస్ట్ : శాసనసభ శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుతో బాధ కలుగుతుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సభను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. గుంటూరులో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సమావేశాల్లో లిక్కర్ మాఫియా, కరువు పరిస్థితులు, శాంతిభద్రతలు, బాక్సైట్ వ్యవహారం, కాల్‌మనీ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించాల్సి ఉండగా వ్యక్తిగత దూషణలతో సభా సమయం వృథా అవుతోందని అన్నారు. సభ నిర్వహణ కత్తిమీద సాము లాంటిదని, నిబంధనలు, సంప్రదాయాలను పాటిస్తూ అజెండా పూర్తిచేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.