న్యాయం కోసం యువతి మౌన దీక్ష
అడ్డపనస (సారవకోట): మండలంలోని అంగూరు పంచాయతీ అడ్డపనస గ్రామంలో కొల్లి అనసూయ తనను వివాహం చేసుకోవాలని చీడి సూర్యనారాయణ అలియాస్ సురేష్ ఇంటి దగ్గర గురువారం మౌన దీక్షకు దిగింది. ఆమె చేస్తున్న మౌన దీక్షకు ఆదీవాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు వాబ యోగేశ్వరరావు, ఐకార్డ్ కార్యదర్శి కొల్లి సింహాచలం మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చీడి సూర్యనారాయణతో ఏడాది కిందట నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తుందని తనను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది.
దీంతో తాను గర్భం దాల్చానని ప్రస్తుతం ఏడు నెలల గర్భవతినని తెలిపింది. ఈ విషయమై తనను సంప్రదిస్తే ఇప్పుడు తనకేమీ సంబంధం లేదని చెబుతున్నాడని పేర్కొంది. దీనిపై తన తల్లిదండ్రులైన కొల్లి లింగయ్య, ఆదిలక్ష్మిలకు తెలపగా గ్రామంలోని పెద్ద మనుషులతో మాట్లాడారని పేర్కొంది. వారు సైతం తనకు న్యాయం చేయకపోవడంతో న్యాయం కోసం మౌనదీక్ష చేస్తున్నట్లు ఆమె తెలిపింది. అదీకాక పది రోజుల నుంచి సూర్యనారాయణ గ్రామంలో అందుబాటులో సహితం లేడని తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది.