జూలో సిద్ధమవుతున్న చింపాంజీల ఎన్‌క్లోజర్
జూలో సిద్ధమవుతున్న చింపాంజీల ఎన్‌క్లోజర్
Published Sun, Aug 7 2016 5:36 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
ఆరిలోవ: జూలో చింపాంజీల కోసం ఎన్‌క్లోజర్ సిద్ధమవుతోంది. జూ అధికారులు గత నెలలో ఇజ్రాయిల్ నుంచి ఇక్కడకు మూడు చింపాంజీలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాటిని క్వారెంటైన్ పరీక్షల కోసం ప్రస్తుతం జూలో ప్రత్యేకమైన నైట్‌క్రాల్‌లో ఉంచారు. వాటి కోసం అనుకూలమైన ఎన్‌క్లోజర్‌ను సిద్ధం చేస్తున్నారు. గతంలో చింపాంజీల కోసమని ఇక్కడ ఎన్‌క్లోజర్ నిర్మించారు. అయితే ఇంతవరకు చింపాంజీలను ఇక్కడకు తీసుకురాలేదు. దీంతో ఖాళీగా ఉన్న ఈ ఎన్‌క్లోజర్‌లో రేసు కుక్కలను విడిచిపెట్టేవారు. ఇప్పుడు చింపాంజీలను ఇక్కడకు తీసుకురావడంతో వాటికి ఎన్‌క్లోజర్ అవసరమైంది. దీంతో అదే ఎన్‌క్లోజర్‌కు రూపులు దిద్ది వాటికి అనుకూలంగా ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఈ ఎన్‌క్లోజర్‌లో ఇంతవరకు ఉన్న గడ్డిని తొలగించారు. దీని అంతటిలోనూ అర అడుగు లోతులో మట్టిని తొలగించారు. కొమ్మల ఆధారంగా చింపాంజీలు బయటకు రాకుండా జాగ్రత చర్యల్లో భాగంగా ఎన్‌క్లోజర్ లోపల, బయట నుంచి గోడలకు అందుబాటులో ఉన్న చెట్ల కొమ్మలను, కొన్ని చెట్లను తొలగించేశారు. ఎన్‌క్లోజర్ చుట్టూ ఇంతవరకు ఉన్న 10 అడుగుల ఎత్త గోడను 20 అడుగులకు పెంచారు. ఎన్‌క్లోజర్ లోపల నుంచి ఇప్పటికే 15 అడుగులు గోడ నిర్మించారు. ఆ గోడపై మరో 5 అడుగుల ఎత్తులో సోలార్ సిస్టంతో తీగలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గోడలపై దానికోసం ఊచలు అమర్చారు. ఈ ఊచలకు విద్యుత్ తీగలు అమర్చనున్నారు. చింపాంజీలు గోడ దూకడానికి ప్రయత్నించే సమయంలో ఈ తీగలను తాకినప్పుడు మెరుపులాంటి కాంతి వస్తుంది. దానికి భయపడి అవి ఆ ప్రయత్నాన్ని విరమించుకొంటాయని జూ క్యూరేటర్ బి.విజయకుమార్ తెలిపారు. ఆ తీగల వల్ల ప్రాణాపాయం ఉండదని తెలిపారు. వాటిని తాకితే షాక్ తగులుతుందనే భయం మాత్రం పుడుతుందన్నారు. సుమారు రెండు వారాల్లో వాటిని సందర్శకుల కోసం ఎన్‌క్లోజర్‌లోకి విడిచిపెట్టనున్నామన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చేతులు మీదుగా వాటిని ఎన్‌క్లోజర్‌లోకి విడిచిపెట్టడానికి ఇక్కడ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Advertisement