పులులు ఏం చేస్తాయో చూద్దామని...
అలవికాని చోట అధికులమనరాదు అన్న సామెత.. ఆవ్యక్తికి తెలుసో లేదో కాని... ఏకంగా పులులతోనే పెట్టుకునేందుకు చూశాడు. తన జిమ్నాస్టిక్ విన్యాసాలను అక్కడ ప్రదర్శించేందుకు ప్రయత్నించాడు. జూ సందర్శించేందుకు వెళ్ళిన పర్యాటకుల్లోని ఓ కుర్రాడు... అప్పటిదాకా కేబుల్ కార్ లో కూచుని శ్రద్ధగానే తిలకించాడు. తీరా పులులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్ క్లోజర్ పైకి వచ్చేప్పటికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చినట్టుంది. తన ప్రతిభను ప్రదర్శిద్దామని ప్రయత్నించాడు. ఉన్నట్టుండి పులులు ఉండే ఎన్ క్లోజర్ నెట్ పైకి దూకేశాడు. ఇంతకూ బతికాడా లేదా అన్నదేగా మీ సందేహం...?
చైనా జంతు ప్రదర్శన శాలలో పులలకు ప్రత్యేక ఎన్ క్లోజర్ ఉంది. సాధారణంగా ఏ జూలో అయినా అలాగే ఉంటుంది. వన్యప్రాణులను తిలకించాలనుకున్నవారిని ప్రత్యేకంగా పకడ్బందీగా ఉన్న వాహనాల్లో లోపలికి పంపుతుంటారు. అయితే చైనాలో తుంటరిగాళ్ళను నమ్మకూడదనుకున్నారో ఏమో జూ సిబ్బంది... సందర్శకులకు కనిపించే విధంగా.. ఎన్ క్లోజర్ పైభాగాన్ని కూడ వలతో పూర్తిగా కప్పేశారు. పులులను చూడాలనుకునేవారు కేబుల్ కార్ ద్వారా (రోప్ వే) వెళ్ళాల్సిందే. ఈ నేపథ్యంలో రోప్ వే ఛైర్ లో నుంచి చూస్తున్నట్టుగా చూస్తూ ఆ కుర్రాడు... ఉన్నట్లుండి వలపైకి దూకేశాడు.
జరిగిన సంఘటనకు తోటి పర్యాటకులు షాకైపోయారు. వెంటనే తేరుకుని పెద్దగా కేకలు వేయడం ప్రారంభించారు. ఈ గందరగోళం గమనించిన పులులు...ఆకతాయిని నోటికి కరచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. ఆ కుర్రాడి అదృష్టం కలసి రావడంతో జూ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వలపై పడిన వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఎదురు చూసిన పర్యాటకులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ వ్యక్తిని పబ్లిక్ న్యూసెన్స్ గా పోలీసులు అరెస్టు చేశారు. ఇంతా చేస్తే. ఇదంతా థ్రిల్ కోసం చేశానని అతడు చెప్పడం విశేషం.
పులుల ఎన్ క్లోజర్ లో వ్యక్తులు పడటం ఇది మొదటిసారి కాదు. ఇండియాలోని గ్వాలియర్ జూ లో 2014 లో ఓ విద్యార్థి 20 అడుగుల గోడ ఎక్కి మరీ పులులను చూసేందుకు ప్రయత్నించి ఎన్ క్లోజర్ లో పడ్డాడు. షర్టు విప్పేసి డ్యాన్స్ చేస్తూ పెన్ లో నానా హంగామా చేశాడు. పులుల మూడ్ ఎలా ఉందో ఏమో జూ సిబ్బంది వచ్చే వరకూ అవి పట్టించుకోపోవడంతో బతికిపోయాడు. అదే సంవత్సరంలో ఢిల్లీ జూలో రెండు తెల్ల పులులున్న ఎన్ క్లోజర్ లో పడ్డ విద్యార్థి... వాటి నోటికి చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. అవును... ఓ సినిమాలో హీరోగారన్నట్లు.. సింహం పడుకుంటే జూలుతో జడేయాలనుకోవడం, పులితో ఫొటో తీయించుకోవాలనుకోవడం మంచిది కాదు మరి...