చర్చావేదికలతో విలువలు పెంచండి
–పాత్రికేయులకు ప్రెస్ అకాడమీ చైర్మన్ దీక్షితులు సూచన
- రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ సందర్శన
రాజమహేంద్రవరం సిటీ : నేటి కాలంలో రోజురోజుకూ రాజకీయాల్లో, మీడియాలో విలువలు తగ్గిపోతున్నాయనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు అన్నారు. తరిగిపోతున్న విలువలను పెంచేందుకు చర్చావేదికల ద్వారా పాత్రికేయులు పూనుకోవాలని పిలుపునిచ్చారు. బుధవారం ది రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌ను సందర్శించిన ఆయన పాలక వర్గం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. 50 సంవత్సరాలు పైబడిన పాత్రికేయులకు పింఛను పంపిణీ, పాత్రికేయులతో పాటు వారి కుటుంబ సభ్యుల కోసం వైద్యశిబిరాల నిర్వహణను కొనియాడారు. రాజకీయాలు, మీడియా ప్రజల కోసమనే రీతిలో విలువలను పెంపొందించాలన్నారు. ప్రెస్‌క్లబ్‌లో క్లబ్ అనే పదాన్ని తొలగించి వేరే పదాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. పాత్రికేయుల వృత్తి నైపుణ్యం పెంచేందుకు గ్రంథాలయం అవసరమన్నారు. దాని ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అకాడమీ ద్వారా గ్రంథాలయం ఏర్పాటుకు సహకరించాలని క్లబ్ అధ్యక్షుడు కోరారు. దీక్షితుల్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్లు శ్రీనివాసరావు, నారాయణరెడ్డి, డీపీఆర్‌ఓ ఫ్రాన్సిస్, ప్రెస్‌క్లబ్ పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల వృత్తినైపుణ్యాల పెంపునకు కృషి చేయాలి
-ప్రెస్ అకాడమీ చైర్మన్‌కు ‘తూర్పు’జాప్ సూచన
రాజమహేంద్రవరం సిటీ : మారుతున్న కాలమాన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జర్నలిస్టుల వృత్తి శిక్షణ నైపుణ్యాల పెంపుదలకు ప్రెస్ అకాడమీ కృషి చేయాలని జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) తూర్పుగోదావరి జిల్లా శాఖ ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులుకు సూచించింది. గతంలో ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించేవారని, కొంతకాలంగా అవి నిలిచిపోయాయన్నారు. బుధవారం రాజమహేంద్రవరం వచ్చిన దీక్షితులును జాప్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పీఎస్‌ఎం కృష్ణంరాజు, జిల్లా అధ్యక్షుడు ఎస్.ధర్మరాజు తదితరుల బృందం కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా జాప్ 25 ఏళ్ల లోగోను ఆవిష్కరించారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా ఆదరణ పెరిగిన నేపథ్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు శిక్షణ ఇవ్వాలని కోరారు. యానాం పాండిచ్చేరి పరిధిలోనిదైనా అక్కడి విలేకరులు మన రాష్ట్రానికి చెందిన వార్తలు రాస్తుంటారన్నారు. అలాగే తెలంగాణ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన 4 మండలాల పరిధిలోని జర్నలిస్టులకు కూడా శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రెస్‌క్లబ్‌లకు అవసరమైన పుస్తకాలను ప్రెస్ అకాడమీ నుంచి అందజేయాలన్నారు. జిల్లాల వారీగా ప్రెస్ అకాడమీ నిర్వహించే కార్యక్రమాలకు తమ వంతు సహకరిస్తామన్నారు.