Published
Wed, Jan 25 2017 12:33 AM
| Last Updated on Tue, Sep 5 2017 2:01 AM
చోరీ బంగారం రికవరీలో రగడ
తణుకు : చోరీకి గురైన బంగారం రికవరీలో రగడ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన ఓ మహిళా నిందితురాలు తాను చోరీ చేసిన సుమారు 300 గ్రాముల బంగారాన్ని తణుకు పట్టణంలోని సురేంద్ర జ్యూయలరీలో మూడునెలల క్రితం తాకట్టు పెట్టింది. ఆమెను అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో ఈనెల 18న విశాఖపట్నం నుంచి వచ్చిన పోలీసులు 150 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. మళ్లీ సోమవారం రాత్రి వచ్చి మిగిలిన 150 గ్రాముల బంగారాన్ని అప్పగించాలని పట్టుబట్టారు. దీంతో షాపు యజమాని వాగ్వాదానికి దిగారు. గతంలోనే రికవరీ చేసి తీసుకెళ్లారు కదా మళ్లీ ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సీఐ సీహెచ్ రాంబాబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించారు. ఇదిలా ఉంటే తమ వద్ద తాకట్టు పెట్టింది 35 గ్రాములేనని బంగారంషాపు యజమాని చెబుతుండటం కొసమెరుపు. ఈ సమయంలో పోలీసులకు వ్యతిరేకంగా స్థానిక బంగారు దుకాణాల యజమానులు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. సురేంద్ర బంగారు నగల దుకాణం యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.