నీటి సమస్య తీర్చాలని మహిళల ధర్నా
ఖానాపూర్ : మండలంలోని మస్కాపూర్ గ్రామంలోని 7వ వార్డు పరిధిలో తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తూ మహిళలు ఖాళీ బిందెలతో శుక్రవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలోని పోచమ్మగల్లికాలనీలో తాగునీరు లేక ప్రజలంతా గ్రామశివారులోని వ్యవసాయ పంటపొలం నుంచి తెచ్చుకోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచుకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేస్తున్నామని అధికారుల మాటలు పత్రిక ప్రకటనలకే పరిమితమయ్యాయన్నారు. మెట్‌పల్లి రహదారిపై మహిళలు రాస్తారోకో చేస్తున్న సమయంలో తహసీల్దార్ అటువైపుగా రావడంతో అడ్డుకొని నీటి సమస్య తీర్చాలంటూ నినాదాలు చేశారు.
కాగా గంటసేపట్లో తాగునీరు వస్తుందని ఈ విషయమై తాను ఇప్పుడే ఎంపీడీవోతో ఫోన్‌లో మాట్లాడడని తహసీల్దార్ న రేందర్ చెప్పడంతో గ్రామస్తులు రాస్తారోకో విరమించారు. అనంతరం అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాలకు వెళ్లి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. గ్రామంలో ఇంకుడుగుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించినా నేటికి బిల్లులు అందడం లేదని ఎంపీడీవో రాధకు ఫిర్యాదు చేశారు.
త్వరలో బిల్లులు అందేలా చూస్తామని గ్రామస్తులు తెలిపారు. రాస్తారోకో చేస్తున్న మహిళలకు కాంగ్రెస్ నాయకుడు జహిర్, బీజేపీ నాయకుడు పిట్టల భూమన్న మద్దతుగా బైఠాయించారు. కార్యక్రమంలో గ్రామస్తులు భీమన్న, సాజిద్, లక్ష్మణ్, భీమవ్వ, గంగవ్వ, లక్ష్మి, నిరోశ తదితరులు పాల్గొన్నారు.