స్వైపింగ్‌తో తంటా!
స్వైపింగ్‌తో తంటా!
Published Sat, Dec 17 2016 10:15 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM
–ఆన్‌లైన్ లావాదేవీలపై అనుమానాలు
కర్నూలు(అగ్రికల్చర్): ఈ చిత్రంలో కనిపించే వ్యక్తి పేరు సత్యనారాయణ చౌదరి. ఒక ప్రభుత్వ అధికారి. నగదు కొరత నేపథ్యంలో ఈయన ఆన్‌లైన్ లావాదేవీలకు అలవాటు పడ్డారు. కర్నూలులోని ఓ షాపింగ్ మాల్‌లో రూ.1000 సరుకులు కొన్నారు. స్వైపింగ్ మిషన్ ద్వారా నగదు బదిలీకి తన ఏటీఎం కార్డును మూడు సార్లు స్వైపింగ్ చేశారు. తన ఖాతాలో డబ్బులు కట్ అయినప్పటికీ షాపింగ్ మాల్ ఖాతాకు జమ కాలేదు. ఈ అధికారికి ఒక్క షాపింగ్ మాల్‌లోనే కాదు. మరో చోట కూడా ఇలాగే జరిగింది.
...ఇతను ఒక్కరే కాదు జిల్లాలో పలువురికి ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం రూ.500, 1000 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో నగదు కొరత రోజురోజుకు పెరుగుతోంది. దీంతో నగదు రహిత లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఉద్యోగులు, విద్యావంతులు తదితరులు ఆన్‌లైన్ లావాదేవీలకు అలవాటు పడుతున్నారు. అయితే ఆన్‌లైన్ లావాదేవీలు పెరగడంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ప్రధానంగా స్వైపింగ్ మిషన్‌ల ద్వారా నగదు బదిలీ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు, బంగారం షాపులు తదితర ప్రధాన వ్యాపార సంస్థల్లో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. స్వైపింగ్ వల్ల వినియోగదారుడి ఖాతా నుంచి డబ్బు కట్ అవుతున్నా... వ్యాపార సంస్థల ఖాతాల్లో క్రెడిట్ కాకపోతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. నగదు రహిత లావాదేవీల వల్ల నష్టపోయే ప్రమాదం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్వైపింగ్ మిషన్‌లపై వత్తిడి పెరగడంతో అనేక సందర్భాల్లో పనిచేయడం లేదు. జేబులో ఏటీఎం కార్డు పెటుకొని షాపింగ్ మాల్స్‌కు వెళ్లి సరుకులు కొనుగోలు చేసిన వారు తమ ఏటీఎంలు స్వైపింగ్ మిషన్‌లలో పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్ లావాదేవీల నేపథ్యంలో హ్యాకర్స్ బెడద కూడా ఉంటోంది. ఫోన్ల ద్వారా ఇతరుల ఖాతాల వివరాలు తెలుసుకొని సాంకేతికత ద్వారా అక్రమాలకు పాల్పడే వారు ఇటీవల పెరగారు.
Advertisement
Advertisement