* రేషన్ బియ్యం ఇవ్వడం లేదు
* పంట నష్టం పరిహారం అందలేదు
* వీధి దీపాలు వెలగవు
* గ్రామాల్లో పేరుకుపోతున్న మురుగు
సాక్షి, అమరావతి బ్యూరో : ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేయడం లేదని, వీధి దీపాలు వెలగవని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని జిల్లాలో పలువురు ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో వాపోయారు. గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం మంగళవారం గుంటూరు తూర్పు, తాడికొండ, వినుకొండ, పొన్నూరు, తెనాలి, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఇజ్రాయిల్‌పేటకు చెందిన రఫ్ ఉన్నిసా అనే మహిళ వీధి దీపాలు వెలగడం లేదని ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫాకు తెలిపారు. ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు మంజూరు కాలేదని కోటేశ్వరమ్మ అనే మహిళ ఎమ్మెల్యే ఎదుట వాపోయింది. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలం దొండపాడుకు చెందిన ఎ.జ్యోతి అనే మహిళ గ్రామంలో పంచాయతీ ద్వారా నీటి సరఫరా జరగడం లేదని, నియోజకవర్గ సమన్వయకర్త హెనీ క్రిస్టినా దష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో మట్టిరోడ్లు కావడం, కాలువలు సరిగా లేకపోవడంతో రోడ్లు బురదమయంగా మారుతున్నాయని సలోమి అనే మహిళ ఫిర్యాదు చేశారు. అన్ని అర్హతలు ఉన్నా పింఛన్ రావడం లేదని పోలు రాజు అనే వ్యక్తి సమన్వయకర్త ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
పంట నష్టం జరిగినా...
అకాల వర్షాలకు పంట నష్టం జరిగినా ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి పరిహారం అందలేదని వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం శానంపూడి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సిద్ధయ్య నియోజకవర్గ సమన్వయకర్త బొల్లాబ్రహ్మనాయుడు దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో వీధి లైట్లు, మురుగు కాల్వలు, మంచినీటి పథకం సరిగా పనిచేయడం లేదని మానపాటి శ్రీనివాస్ తెలిపారు. పొన్నూరు పట్టణంలో 3వ వార్డుకు చెందిన దుర్గమ్మ అనే మహిళ పింఛను రావడం లేదని నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణకు ఫిర్యాదుచేశారు. గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు మంజూరు చేయలేదని, జన్మభూమి కమిటీలు సిఫార్సు చేస్తేనే గ్యాస్ ఇస్తామని అంటున్నారని నాగేశ్వరమ్మ అనే మహిళ వాపోయింది.
పింఛను రావడం లేదు..
తెనాలి మండలం కొలకలూరు ముస్లిం కాలనీకి చెందిన మహిళలు షేక్ బీనాబి, రహీమున్నీసా, ఫాతిమున్నిసా, నాగరత్నమ్మ తమకు పింఛను అందడం లేదని నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ ఎదుట వాపోయారు. గ్రామంలో సైడు కాల్వలు లేక మురుగునీరు ప్రవహిస్తోందని, బ్లీచింగ్, సున్నం కూడా వేయడం లేదని, దీంతో దోమల విపరీతంగా పెరిగిపోయాయని జిలానీ, జానీ, రఫీముల్లా పేర్కొన్నారు.
రేషన్ బియ్యం అందడం లేదు..
చిలకలూరిపేట రూరల్ మండలం వేలూరుకు చెందిన ఛాయమ్మ అనే మహిళ మంచంలో నుంచి కదలలేకుండా ఉన్నానని, ఐరిస్, ఫింగర్‌ప్రింట్స్ పనిచేయడం లేదని, అందుకని నాకు రేషన్ బియ్యం ఇవ్వడం లేదని నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం ఇల్లు నిర్మించుకున్నా ఇంత వరకు బిల్లులు ఇవ్వలేదని శ్యామల అనే మహిళ వాపోయింది. ఇప్పుడు జన్మభూమి కమిటీలు సిఫార్సు చేస్తే ఇల్లు మంజూరు చేస్తామని అంటున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు పలు సమస్యలను వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిల దృష్టికి తీసుకు రాగా, మీకు అండగా ఉండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని వారు భరోసా ఇచ్చారు.