సమస్యల నివేదన
ఆరు నియోజకవర్గాల్లో గడపగడపకు వైఎస్సార్
వైఎస్సార్‌సీపీ నేతల ఎదుట కష్టాలు ఏకరువు పెడుతున్న ప్రజలు
సాక్షి, గుంటూరు: రేషన్ కార్డులు, గృహ రుణం కోసం దరఖాస్తు చేసి ఎన్నిసార్లు తిరిగినా మంజూరు కాలేదు.. వరదల్లో పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం ఇంతవరకు ఆదుకోలేదు.. గ్రామాల్లో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు.. అంటూ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం జిల్లాలో శుక్రవారం ఆరు నియోజకవర్గాల్లో జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు నేతలకు తమ సమస్యలు నివేదించారు.
ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారు..
రేషన్ కార్డు కోసం అధికారులకు అనేక సార్లు దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు మంజూరు కాలేదని గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ పరిధిలోని రెండో డివిజన్ ఇజ్రాయిల్‌పేటకు చెందిన షేక్ పర్విన్ అనే మహిళ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా ఎదుట వాపోయారు. గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు తప్ప మంజూరు చేయడం లేదంటూ ఎం.చినమస్తాన్ ముస్తఫా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
పంటలు దెబ్బతిన్నా పట్టించుకున్నవారు లేరు..
వరదల్లో పంటలు పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా నష్టాలపాలయ్యామని, ప్రభుత్వం ఇంతవరకు ఆదుకోలేదంటూ రాజుపాలెం మండలం అంచులవారిపాలెం గ్రామానికి చెందిన తోటా శౌరయ్య అనే రైతు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి ఎదుట వాపోయారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం కింద ఇల్లు మంజూరు చేస్తామంటూ గ్రామానికి చెందిన కొందరు టీడీపీ దళారులు రూ.5 వేలు తీసుకున్నారని, ఇంతవరకు పట్టించుకోలేదని, డబ్బులు కూడా తిరిగి ఇవ్వటం లేదని గ్రామానికి చెందిన గణపా శారద అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.
తాగేందుకు నీరు లేదు..
గ్రామాల్లో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, మద్యం మాత్రం ఏరులై పారుతోందని అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారంటూ చిలకలూరిపేట మండలం బొప్పూడికి చెందిన సుశీల అనే మహిళ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
రోగాల బారిన పడుతున్నాం..
దుగ్గిరాలలో కాఫీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే మురుగునీరు వల్ల గ్రామంలోని తాగునీటి చెరువు కలుషితంగా మారి రోగాలబారిన పడుతున్నామంటూ తెనాలి మండలం కొలకలూరు బీసీ కాలనీకి చెందిన శివనాగేంద్రమ్మ, ప్రసాదం శ్రీనివాస్ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో రోడ్లు వేసిన దాఖలాలు లేవని, గతంలో నిర్మించుకున్న ఇళ్లకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదని గ్రామానికి చెందిన జెట్టి మంగమ్మ, కొప్పర ప్రసాదరావు పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు ఎదుట వాపోయారు. గ్రామంలో కనీస మౌలిక వసతులైన తాగునీరు, డ్రెయినేజీ వ్యవ్యస్థ, వీధి దీపాలు సైతం ఏర్పాటు చేయలేదని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని బొల్లాపల్లి మండలం కనుమలచెరువు గ్రామానికి చెందిన వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడుకు వివరించారు. జనం సమస్యలపై నేతలు స్పందిస్తూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.