* వీధి లైట్లు లేక రాత్రిళ్లు భయం భయం
* అందని ద్రాక్షగా మారిన రుణమాఫీ
* నకిలీ విత్తనాలతో నిండా మునిగాం.. ఆదుకోండి
* ‘గడప గడపకు వైఎస్సార్’లో ప్రజానీకం సమస్యల ఏకరువు
సాక్షి, అమరావతి బ్యూరో: గ్రామాల్లో అంతర్గత రోడ్లు నరకకూపంగా ఉన్నాయని, పారిశుద్ధ్యం అధ్వానంగా మారిందని పలు గ్రామాల ప్రజలు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జుల దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం ‘గడప గడపకు వైఎస్సార్’ కార్యక్రమం గుంటూరు తూర్పు, తెనాలి, వినుకొండ, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో జరిగింది. ఈ సందర్భంగా జనం తాము పడుతున్న ఇబ్బందులను నేతలకు వివరించి పరిష్కరించాలని కోరారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని రెండో డివిజన్‌లోని గాంధీనగర్‌కు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి డ్రెయిన్లలో నీరు నిల్వ ఉంటోందని, ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగాయని, దీంతో దోమల బెడద తీవ్రంగా ఉందని ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా దృష్టికి తీసుకొచ్చాడు. ఆర్టీసీ కాలనీలో రోడ్లు సరిగా లేవని, నడవాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు ఎమ్మెల్యేకు తెలిపారు. విద్యుత్ తీగలు వేలాడుతూ భయపెడుతున్నాయని హరీష్ ఆవేదన వ్యక్తం చేశాడు. స్పందించిన ఎమ్మెల్యే పూడిక, పిచ్చిమొక్కలను పొక్లయినర్ల ద్వారా తొలగించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. విద్యుత్ సమస్యపై అధికారులతో చర్చించారు.
తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం బేతపూడి గ్రామంలో రాత్రి వేళల్లో తిరగాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వీధి లైట్లు లేవని గాలి బిక్షమ్మ నియోజకవర్గ కన్వీనర్ కత్తెర సురేష్ దృష్టికి తీసుకొచ్చారు. తుళ్లూరు మండలం దొండపాడు గ్రామ పంచాయతీ పరిధిలో సమస్యలపై స్పందించడం లేదని అచ్చయ్య, సుహాసిని నియోజకవర్గ ఇన్‌చార్జి కత్తెర హెనీ క్రిస్టినా దృష్టికి తెచ్చారు. వర్షాలు పడితే కాలువలు నిండి నీరు బయటకు వెళ్లడం లేదని, అష్టకష్టాలు పడాల్సివస్తోందని గ్రామస్తులు పేర్కొన్నారు.
తెనాలి పట్టణంలోని కొలకలూరుకు చెందిన చొప్పయ్య అనే రైతు ఆంధ్రా బ్యాంకులో రెండేళ్ల క్రితం రూ. 40వేలు రుణం తీసుకున్నానని, మాఫీ కాలేదని నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నాబత్తుని శివకుమార్ దృష్టికి తెచ్చాడు. తమ వీధిలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఖాసిం, వెంకటరావు, కరీముల్లా, విశ్వేశ్వరరావులు ఫిర్యాదు చేశారు.
వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం పలుకూరు పంచాయతీ రామాపురం గ్రామానికి చెందిన ఎస్.కె.మౌలాలి, షేక్ బోడయ్యలు నకిలీ మిర్చి విత్తనాలతో నిండా మునిగామని వాపోయారు. ఎస్.మౌలాలి అనే రైతు మూడు ఎకరాల్లో పంటను సాగు చేశానని, రూ. 50వేలకు పైగా పెట్టుబడి అయిందని వివరించారు. షేక్ బోడయ్య ఐదు ఎకరాల్లో పంట సాగు చేశానని, ఇప్పటి వరకు రూ. 80వేలకు పైగా పెట్టుబడి పెట్టానని, నకిలీ విత్తనాలు కావడంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లాబ్రహ్మనాయుడు దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతామని ప్రజలకు భరోసా ఇస్తూ గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని ఆ పార్టీ నేతలు చేపట్టారు.
తాగేందుకు నీరు లేదు..
గుంటూరు రూరల్ మండలం అంకిరెడ్డిపాలెంలో నాలుగేళ్లుగా తాగేందుకు సరిగా నీరందక ఇబ్బందులు పడుతున్నామని రోశమ్మ అనే మహిళ నియోజకవర్గ ఇన్‌చార్జి మేకతోటి సుచరితకు తెలిపారు. ఎస్సీ కాలనీలో అంతర్గత రోడ్ల గురించి పట్టించుకున్న నాథుడే లేరని ఎం.ప్రభావతి తమ సమస్యను ఇన్‌చార్జి దృష్టికి తీసుకొచ్చారు.