అరగుండు గీయించుకుని నిరసన
కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ శుక్రవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు అరగుండుతో నిరసన తెలిపారు.
కర్నూలు(హాస్పిటల్): కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ శుక్రవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు అరగుండుతో నిరసన తెలిపారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వారు ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, గాంధీ విగ్రహం వద్ద అరగుండు గీయించుకున్నారు. ఈ సందర్భగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి మనోహర్ మాణిక్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మునెప్ప మాట్లాడుతూ.. కనీస వేతనాలు అమలు చేయాల్సిన ఆసుపత్రి, కార్మిక శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. అనంతరం ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర, మూడవ పట్టణ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి సమక్షంలో ఏఐటీయూసీ నాయకులతో చర్చలు జరిపారు. రెండు గంటల పాటు చర్చలు నిర్వహించినా ఫలితం రాలేదు. దీంతో ఆందోళన కొనసాగిస్తామని నాయకులు ప్రకటించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రామకృష్ణారెడ్డి, నాగరాజు, జయరాజు తదితరులు పాల్గొన్నారు.