ఉరితాళ్లతో వినూత్న నిరసన
కర్నూలు(హాస్పిటల్): వేతనాల పెంపు కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్న ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు బుధవారం సాయంత్రం ఉరితాళ్లతో వినూత్న నిరసన తెలిపారు. అంతకుముందు వేతనాల పెంపుకోసం ఆసుపత్రి అధికారుల సమక్షంలో ఏఐటీయూసీ నాయకులు ఏజెన్సీతో చర్చలు జరిపారు. జీవో నెం.68 తమకు ఇచ్చిన అగ్రిమెంట్‌లో లేదని, వేతనాలు పెంచే ప్రసక్తి లేదని ఏజెన్సీ ప్రతినిధులు తేల్చిచెప్పారు. నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని సూచించారు. దీంతో ఏఐటీయూసీ నాయకులు మనోహర్ మాణిక్యం, మునెప్ప మాట్లాడుతూ.. ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులకు అన్యాయం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. అనంతరం సాయంత్రం దీక్షా స్థలి వద్ద ఉరితాళ్లతో మెడకు కట్టుకుని నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి.అబ్రహాం, జయరాజు, ఏఐటీయుసి నాయకులు పాల్గొన్నారు.