విద్యా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి
విద్యా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి
Published Thu, Jul 28 2016 8:11 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
యాదగిరిగుట్ట : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై విద్యార్ధి లోకమంతా ఏకమై ఉద్యమించాలని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్ కుమార్ అన్నారు. యాదగిరిగుట్టలో మూడు రోజులుగా జరుగుతున్న ఏఐఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో ముగింపు రోజైన గురువారం ఆయన ప్రధాన వక్తగా మాట్లాడారు. మతోన్మాద విధానాలకు, విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యమించాలన్నారు. విశ్వవిద్యాలయాలను పూర్తి స్థాయిలో నిధులు కేటాయించ కుండా వాటిని నిర్వీర్యం చేస్తూ, ప్రవేట్, విదేశీ యూనివర్సిటీలను ఈ దేశంలోకి తీసుకురావాలని పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యను మరిచి విద్యార్థులకు చదువును దూరం చేస్తుందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యకు కొమ్ముకాస్తూ నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ విద్య అందకుండా కుట్ర చేస్తుందని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ నేటి ప్రభుత్వాలకు పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు, కార్పొరేట్, ప్రైవేట్ వ్యక్తులు, సారా వ్యాపారులపై ఉన్న ఆసక్తి విద్యా రంగంపై లేదని ఆరోపించారు. శిక్షణ తరగతుల్లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శివరామకృష్ణ, అధ్యక్షులు ఎం.వేణు, రాజారాం, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చేపూరి కొండల్, బరిగె వెంకటేష్, ఉదయ్‌కుమార్, బబ్బూరి శ్రీధర్, లలిత, రాధిక, అశ్వీని, భారతీ, బండి జంగమ్మ, గాదెగాని మాణిక్యం తదితరులున్నారు.
Advertisement
Advertisement