ధర్నాను విజయవంతం చేయాలి
Published Mon, Sep 26 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
విద్యారణ్యపురి : ఉద్యోగ, ఉపాధ్యాయుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ అక్టోబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రోగ్రెసీవ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
ఆదివారం హన్మకొండలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో జరిగిన ఆ సంఘం జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ పొందడం హక్కు అని, పాలకుల దయాదాక్షిణ్యాలతో వేసే భిక్ష కాదని 1982లోనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. గతంలో యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు అమలు చేస్తున్న నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా ప్రపంచబ్యాంకు, బహుళజాతి, పారిశ్రామిక, వాణిజ్య వర్గాల ఒత్తిడితో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ విధానంతో ఎంతో నష్టం కలుగుతుందన్నారు. సీపీఎస్ రద్దుకోసం 11 ఉపాధ్యాయసంఘాలతో అక్టోబర్ 1న హైదరాబాద్‌లో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేడర్ పోస్టులు, రాష్ట్ర కేడర్ పోస్టులు మాత్రమే ఉంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. దానికి కొన్ని సంఘాలు వంత పాడుతున్నాయన్నారు. ఇప్పుడున్న రెండు జోన్లకు బదులు ఆరు జోన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి యూ.అశోక్, రాష్ట్ర కౌన్సిలర్ కడారి భోగేశ్వర్ మాట్లాడారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్ జిల్లా బాధ్యులు ఎస్.గోవర్దన్ , డి.శ్రీనివాస్, పి.చంద్రం, మహబూబ్‌అలీ, వి.సోమేశ్వర్, బి.స్వామి, ఎస్.ఉపేందర్‌రెడ్డి, హెచ్.సమ్మయ్య, బి.సారయ్య, ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement