‘ఏఎన్‌యూ’లో పీఎఫ్ ఉఫ్!
► ఈపీఎఫ్ వ్యవహారాలపై పర్యవేక్షణ శూన్యం
► గతంలో ఖాతాల అంకెలు మార్చి లోన్ పొందిన ఉద్యోగులు
► గత ఏడాది వెలుగు చూసిన మరో పీఎఫ్ కుంభకోణం
► తాజాగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిధులు స్వాహా చేసిన నిర్వాహకుడు
► కమిటీలతో కాలక్షేపం చేస్తున్న ఉన్నతాధికారులు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అక్రమాలకు ఏఎన్‌యూ నిలయంగా మారుతోంది. ఉద్యోగుల సంక్షేమానికి ఉపయోగపడాల్సిన పీఎఫ్ నిధులను కొందరు అక్రమార్కులు చేతివాటంతో అడ్డదారిన తమ జేబులు నింపేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఏఎన్‌యూలో వరసగా పీఎఫ్ కుంభకోణాలు చోటు చేసుకుంటున్నాయి.
ఏఎన్‌యూ :
ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ పీఎఫ్ ఖాతాల నిర్వహణను పగడ్బందీగా పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన యూనివర్సిటీ ఉన్నతాధికారులు చోద్యం చూస్తుండటంతో కుంభకోణాలు వరుసగా జరుగుతున్నాయి.
గతంలో పలు కుంభకోణాలు..
యూనివర్సిటీలో పీఎఫ్ ఖాతాలకు సంబంధించి పలు కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. యూనివర్సిటీ ఎకౌంట్స్ విభాగంలో పీఎఫ్ వ్యవహారాలు చూసే ఇద్దరు ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాల్లో అంకెలు మార్పు చేసి అధిక మొత్తంలో లోన్ పొందిన ఘటన ఆరేళ్ళ క్రితం వెలుగులోకి వచ్చింది. తమ ఖాతాలో వేలాది రూపాయలను లక్షల్లో చూపి ఆ ఇద్దరు లోన్ పొందటం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన అప్పటి వీసీ విచారణ జరిపి బాధ్యులైన ఇద్దరు రెగ్యులర్ ఉద్యోగులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు.
కానీ పీఎఫ్ ఖాతాల పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలేమీ తీసుకోలేదు. దీంతో గత ఏడాది మరో పీఎఫ్ ఘటన వెలుగులోకి వచ్చింది.దీనిపై అతి కష్టంగా స్పందించిన ఉన్నతాధికారులు కుంభకోణంపై విచారణ కమిటీని వేసి చేతులు దులుపుకున్నారు. వీటితోపాటు యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుల నుంచి పీఎఫ్ మొత్తాలను వసూలు చేస్తూ ఏజెన్సీ నిర్వాహకుడు సకాలంలో వారి ఖాతాల్లో జమ చేయని ఘటనలూ గతంలో జరిగాయి. ఉద్యోగులు నిలదీయటంతో గుట్టు చప్పుడు కాకుండా నిధులను జమ చేసిన సందర్భాలు ఉన్నాయి.
తాజాగా మరో కుంభకోణం వెలుగులోకి..
ఈపీఎఫ్‌కు సంబంధించిన మరో భారీ కుంభకోణం గత నెలలో వెలుగు చూసింది. యూనివర్సిటీ వాటర్ వర్క్స్ విభాగంలో పనులను ఔట్ సోర్సింగ్ ద్వారా నిర్వహించేందుకు అనుమతి పొందిన తెనాలికి చెందిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు ఏళ్ళ తరబడి ఉద్యోగుల ఖాతాల్లోకి జమ చేయకుండా భారీగా నిధులు మింగేశాడు. తమ పీఎఫ్ మొత్తాలను జమ చేయకుండా నిర్వాహకుడు మింగేస్తున్నాడని, చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్‌లో విధులు నిర్వహిస్తున్న 12 మంది గత నెల 21న గుంటూరులోని ఈపీఎఫ్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పీఎఫ్ కమిషనర్ వచ్చి పరిశీలించి కుంభకోణం నిజమేనని తేల్చే వరకు యూనివర్సిటీ అధికారులు మిన్నకుండటం విశేషం. కుంభకోణం వెలుగులోకి రావటంతో గత నెల 24న ఏజెన్సీ నిర్వాహకుడు తన తప్పును పీఎఫ్ కమిషనర్ వద్ద లేఖ రూపంలో అంగీకరించాడు. ఫిబ్రవరి 28 లోగా జమ చేస్తానని ఆ లేఖలో పేర్కొన్నాడు. కానీ నేటి వరకు పూర్తి స్థాయిలో జమ చేయలేదని తెలుస్తోంది.
అధికారుల నిర్లక్ష్యమే కారణం..
వరసగా చోటు చేసుకుంటున్న ఈపీఎఫ్ కుంభకోణాలకు యూనివర్సిటీ ఉన్నతాధికారుల ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యయే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది చోటు చేసుకున్న పీఎఫ్ ఘటనపై విచారణ కమిటీని నియమించి చేతులు దులుపుకున్న ఉన్నతాధికారులు గత నెలలోని కుంభకోణంపై కనీసం స్పందించకపోవటం దీన్ని తేటతెల్లం చేస్తోంది. యూనివర్సిటీ ఉన్నతాధికారులు పీఎఫ్ ఖాతాల నిర్వహణలో పారదర్శకతను పెంచి భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన ఉద్యోగులు కోరుతున్నారు.