జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కవిత
- సీఎంతో మాట్లాడి జిల్లాకు మరిన్ని నిధులు
- జెడ్పీకి కేంద్ర నిధులు ఇవ్వడం లేదు
- నిధుల కొరతతో అభివృద్ధికి ఆటంకం
- జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
- ‘సాక్షి’ఇంటర్వ్యూలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కవిత
ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి చేసి జిల్లా పరిషత్‌లు పూర్వ వైభవం తీసుకవచ్చేందుకు పాటుపడతానని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టి ఆదివారానికి రెండేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా ‘సాక్షి’తో ఆమె పలు అంశాలపై ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వం పలు పథకాలకు బ్రేక్ వేసిందని, దీంతో జిల్లా పరిషత్ పాలనకు కొంతమేర ఆటంకం కలిగిందన్నారు. ముఖ్యమంత్రి కే సీఆర్‌తో మాట్లాడి జిల్లా అభివృద్ధికి నిధులు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి మంత్రి తుమ్మల నాగేశ్వరావు విశేష కృషి చేస్తున్నారని, ఆయన సహకారంతో అభివృద్ధికి తన వంతు పాటుపడతానన్నారు. గ్రామ పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, త్వరలో తండాలను సైతం పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడినా జిల్లా పరిషత్ పాలన రెండుచోట్ల ఉంటుందని పేర్కొన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు..
ప్ర: పాలనలో సంతృప్తికరంగా ఉందా...?
జ: రెండేళ్ల పాలన సంతృప్తికరంగా ఉంది. అందరి సహకారంతో ఉన్న నిధులతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నా. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో తొలి జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యా, ఈ పదవి దక్కడం అదృష్టంగా భావిస్తున్నా.
ప్ర: రెండేళ్ళలో మీరు చేసిన అభివృద్ధి ..?
జ: రెండేళ్ళ పాలనలో రూ. 424 కోట్లతో జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాం. మంచినీటి సరఫరా, బోర్లు, íసీసీ రోడ్ల, అంగన్‌వాడీ బిల్డింగ్‌ల నిర్మాణం చేపట్టాం. రోడ్లు, వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. పలు రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపాం.
ప్ర: జిల్లాల విభజనలో మీ పయనం ఎటు..?
జ: జిల్లాల పునర్విభజన పక్రియ జరుగుతుంది. ఇంకా మూడేళ్ళు కాలపరిమితి ఉంది. నిర్ణయం తీసుకోలేదు. సమయం వచ్చినప్పుడు నిర్ణయం ప్రకటిస్తా.
ప్ర: రాబోయే రోజుల్లో చేపట్టే అభివృద్ధి పనులు ..?
జ: జిల్లా అభివృద్ధికి నిధులు వచ్చేలా కృషి చేస్తా. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ప్రయత్నిస్తా. స్థానిక సంస్థల కేంద్ర బిందువు జెడ్పీ సొంత వనరులపై దృష్టి సారిస్తా.
ప్ర: కేంద్ర నిధులు పరిస్థితి ఎంటీ..?
జ: జిల్లా పరిషత్‌లకు కేంద్రం నుంచి ప్రతి ఎటా కోట్లాది రూపాయల నిధులు వచ్చేవి. వాటిలో నుంచి గ్రామ పంచాయతీలకు 50 శాతం, మండల పరిషత్‌లకు 30 శాతం, జిల్లా పరిషత్‌కు 20 శాతం నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేశాం. కాని గత రెండేళ్ళుగా ప్రభుత్వం బీఆర్‌జీఎఫ్ పథకాన్ని కేంద్రం ఎత్తి వేసింది. దీంతో నిధులు రాక అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది.
ప్ర: ప్రభుత్వ ప«థకాలు ఎలా అమలవుతున్నాయి..?
జ: తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. సంక్షేమం, అభివృద్ధి సమానంగా జరుగుతుంది. ఇంటింటికి నీరు అందించే లక్ష్యంతో ‘మిషన్ భగిరథ’ జిల్లాలో పరుగులు తీస్తుంది. సెప్టెంబర్ నాటికి జిల్లాలో 102 హ్యబిటేషన్లలో నీరు అందించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సా«రథ్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాకతీయ మిషన్, హరితహారంలో జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఓడీఎఫ్ లక్ష్యంగా మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతుంది.