రబీ విత్తనం..పంపిణీ ప్రశ్నార్థం
రబీ విత్తనం..పంపిణీ ప్రశ్నార్థం
Published Fri, Sep 16 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
– జాడలేని బయోమెట్రిక్‌లు
– ఇంతవరకు ఖరారు రాని ధరలు
–వర్షాలు పడుతుండడంతో రైతుల ఎదురు చూపు
కర్నూలు(అగ్రికల్చర్): రబీ సీజన్ ముంచుకొస్తున్నా.. విత్తనాల పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు. మరోవైపు వర్షాలు విస్తారంగా పడుతుండటంతో రైతులు రబీ సీజన్‌కు సిద్ధం అవుతున్నారు. జిల్లాలో ప్రధానంగా రబీలో శనగ పంటను సాగు చేస్తారు. ప్రతి ఏడాది జిల్లాలో రెండు లక్షల హెక్టార్లకు పైగా ఈ పంట సాగవుతోంది. ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం.. వేరుశనగ, కొర్ర, మొక్కజొన్న వంటి పంటలు దెబ్బతినడంతో ఈ ఏడాది శనగ సాగు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ మండలాల్లో రైతులు దెబ్బతిన్న పంటలను దున్నేసి రబీకి సిద్ధం అవుతున్నారు. ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం తదితర ప్రాంతాల్లో రైతులు ఈ మేరకు పొలాలను సిద్ధం చేసుకున్నారు. అయితే విత్తనాల పంపిణీ ఎప్పుడనేది ప్రశ్నార్థకంగా మారింది.
కేటాయింపులు ఇలా...
జిల్లాకు శనగ విత్తనాలు 98వేల క్వింటాళ్లు కేటాయించారు. సాగు విస్తీర్ణాన్ని బట్టి మండలాల వారీగా వీటిని పంపిణీ చేయాల్సి ఉంది. ఈ సారి బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. ఇంతవరకు బయోమెట్రిక్ మిషన్‌లు జిల్లాకు రాలేదు. బయోమెట్రిక్ ద్వారా విత్తనాలు పంపిణీ చేయాలంటే ముందుగా వ్యవసాయాధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇంతవరకు దీనిపై ఎలాంటి చర్యలు లేవు. ముఖ్యంగా సబ్సిడీపై పంపిణీ చేసే శనగ విత్తనాలు ధర, సబ్సిడీలు ఖరారు కాలేదు. ధరలు ఖరారు కానిదే విత్తనాలను పంపిణీకి పొజిషన్ చేయలేరు. ఇందువల్ల విత్తనాల పంపిణీలో ఈ సారి జాప్యం జరిగే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారులే పేర్కొంటున్నారు.
ఏవోల చుట్టూ ప్రదక్షిణ..
రబీ సీజన్ ముంచుకొస్తున్నా విత్తనాల పంపిణీ అతీగతీ లేకుండా పోయింది. దీంతో విత్తనాల పంపిణీ ఎపుడూ అంటూ రైతులు కొద్ది రోజులుగా వ్యవసాయ అధికారుల(ఏవోల) చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేకపోవడంతో వ్యవసాయాధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 22 నుంచి విత్తనాల పంపిణీ మొదలైంది. ఈ సారి ఇప్పటి వరకు విత్తనాల పంపిణీపై ప్రభుత్వం నుంచే తగిన చర్యలు లేకపోవడంతో అధికారులు కూడ కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై జేడీఏ ఉమామహేశ్వరమ్మను వివరణ కోరగా.. విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని.. ధరలు ఖరారు అయిన వెంటనే పొజిషన్ చేస్తామని చెప్పారు.
Advertisement