సోమవారం నుంచి సినిమా చూపిస్తాం
యూనివర్సిటీక్యాంపస్ (తిరుపతి): ‘‘మాకు సోమవారంతో సెమిస్టర్ పరీక్షలు అయిపోతాయి, తీరుబడి దొరుకుతుంది. ఈ రోజు చేసిం ది జస్ట్ శాంపిల్ మాత్రమే. మండే నుంచి సినిమా చూపిస్తాం’’ ఇదీ తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఎంసీఏ విద్యార్థులు జూనియర్లకు చేస్తున్న హెచ్చరిక. యూనివర్సిటీ వసతి గృహాల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్లను తమ గదులకు పిలిపించుకుని యథేచ్ఛగా ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు.
ర్యాగింగ్ నివారణకు చర్యలు తీసుకోవాలని, జరగకుండా చూడాలని ఉన్నతాధికారులు చేసిన ఆదేశాలను వార్డెన్లు, అధ్యాపకులు పట్టించుకోకపోవడంతో ర్యాగింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దీం తో శనివారం ఇద్దరు విద్యార్థులు వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగ నాయకులను ఆశ్రయించారు. తమకు టీసీలు ఇప్పిస్తే వెళ్లిపోతామని మొరపెట్టుకున్నారు. అసలేం జరిగిందని వారిని విచారిస్తే.. ర్యాగింగ్ భూతాలు తమను వేధించిన తీరును వివరించారు.
అసలేం జరిగిందంటే..
ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 10 నుంచి తరగతులు ప్రారంభమయ్యా యి. దీంతో నూతన విద్యార్థులకు డీ-బ్లాక్‌లో వసతి కల్పించారు. సీనియర్ విద్యార్థులు తమ హాస్టల్‌లో రెండో ఫ్లోర్‌లో వసతి పొందుతున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో సీనియర్ విద్యార్థులు జూనియర్లను తమ గదులకు పిలిపించుకుని ర్యాగింగ్ చర్యలకు పాల్పడ్డారు. చేతులు చాపి 2 గంటల పాటు అదే పొజిషన్ నిలబడాలంటూ కొంతమంది విద్యార్థులను ఆదేశించారు. ఇది ట్రైలర్ మాత్రమేనని సోమవారం నుంచి సినిమా చూపిస్తామని వారు హెచ్చరించారు. టేబుల్ కింద క్రికెట్ ఆడిస్తామని, నేల మీద ఫ్రాక్ నడక నేర్పుతామని, స్విమ్మింగ్ పూల్ లేకపోయినా ఈతకొట్టే విధానం చేసి చూపించాల్సి ఉంటుందని జూనియర్లకు చెప్పారు. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే విభాగాధిపతికి చెప్పి అన్ని సబ్జెక్టులు ఫెయిల్ చేయిస్తామని భయపెట్టారు.
పట్టించుకోని కమిటీలు..
నాగార్జున వర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో ఎస్వీయూలో ర్యాగింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి వీసీ రాజగోపాల్, రిజిస్ట్రార్ దేవరాజులు.. వర్సిటీ అధ్యాపకులు, వార్డెన్లు, ప్రిన్సిపాళ్లకు ఆదేశాలిచ్చారు. ఆ మేరకు కమిటీలను వేశారు. ఒక విభాగానికి చెందిన నలుగురు ఈ కమిటీలేసి నిత్యం పర్యవేక్షించాలన్నారు. కానీ ఈ ఆదేశాల్ని కమిటీ సభ్యులు లెక్కచేయలేదని ఆరోపణలొస్తున్నా యి. దీంతో వసతిగృహాల్లో ర్యాగింగ్ కొనసాగుతూనే ఉందని విద్యార్థులు వాపోతున్నారు.