-
జిల్లాలో 2.2 సెం.మీ వర్షపాతం నమోదు
-
సత్తుపల్లి, పినపాక, ముల్కలపల్లి మండలాల్లో కుండపోత
ఖమ్మం వ్యవసాయం: వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లాల్లో శనివారం మొదలైన వర్షాలు ఆదివారం నాటికి పుంజుకున్నాయి. ఆదివారం రోజున మూడు మండలాలు (ఎర్రుపాలెం, బోనకల్లు, ఇల్లెందు) మినహా అన్నిచోట్ల వర్షం కురిసింది. ఆదివారం ఉదయానికి జిల్లా సగటు వర్షపాతం 2.2 సెం.మీ.గా నమోదైంది. సత్తుపల్లి, పినపాక, ముల్కలపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. చండ్రుగొండ, వెంకటాపురం, దుమ్మగూడెం, భద్రాచలం, దమ్మపేట, వేంసూరు, పెనుబల్లి, కూసుమంచి మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. 14 మండలాల్లో సాధారణ స్థాయిలో, 13 మండలాల్లో అక్కడక్కడ వర్షం పడింది. అత్యధికంగా సత్తుపల్లి మండలంలో 7.82 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
పుంజుకున్న వర్షపాతం
జిల్లాలో వర్షపాతం కొంతమేరకు పుంజుకుంది. ఏడు మండలాల్లో (పినపాక, మణుగూరు, అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు, ముల్కలపల్లి, సత్తుపల్లి) సాధారణానికి మించి (20 శాతానికి పైగా) వర్షపాతం నమోదైంది. 28 మండలాల్లో (వాజేడు, వెంకటాపురం, చర్ల, గుండాల, దుమ్ముగూడెం, పాల్వంచ, కొత్తగూడెం, టేకులపల్లి, ఇల్లెందు, బయ్యారం, గార్ల, కామేపల్లి, జూలూరుపాడు, చండ్రుగొండ, అశ్వారావుపేట, దమ్మపేట, వేంసూరు, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ, ఏన్కూరు, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, ముదిగొండ, వైరా, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం)లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆరు మండలాల్లో (సింగరేణి, చింతకాని, కూసుమంచి, తిరుమలాయపాలెం, కొణిజర్ల, నేలకొండపల్లి) ఇంకా లోటు వర్షపాతమే ఉంది. మొత్తంగా చూస్తే, సింగరేణి మినహా ఏజెన్సీ అంతటా వర్షపాతం సాధారణం.. అంతకున్నా ఎక్కువగా ఉంది. మైదాన ప్రాంతంలోని ఐదు మండలాల్లో లోటు వర్షపాతం ఉంది.
జలాశయాల్లోకి చేరుతున్న నీరు
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి వరద నీరు చేరింది... ఇంకా చేరుతోంది. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టులోకి వరద నీటి రాక పెరుగుతోంది. సత్తుపల్లి మండలంలోని జలాశయాల్లోకి నీరు చేరుతోంది. ముల్కలపల్లి మండలంలోని ముత్యాలంపాడు వాగు ప్రవహిస్తోంది. మూకమామిడి ప్రాజెక్టులోకి కూడా వరద నీరు వస్తోంది. దమ్మపేట మండలంలోని చెరువులు, కుంటలు నిండుతున్నాయి. వేంసూర్ మండలంలో దిద్దుపూడి వాగు ప్రవహిస్తోంది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టులోకి నీరు చేరుతోంది. కొత్తగూడెం మండలంలోని ముర్రేడు వాగు ప్రవహిస్తోంది. మణుగూరు, అశ్వాపురం, మణుగూరు, బూర్గంపాడు మండలాల్లోని చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతోంది. ప్రస్తుతం సాగులోగల పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి తదితర పైర్లకు ఈ వర్షాలు ఉపయోగపడతాయి.
జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు (సెం.మీలలో)
––––––––––––––––––––––––––––––––––––––––––––––
మండలం వర్షపాతం(సెం.మీ.లలో)
––––––––––––––––––––––––––––––––––––––––––––––
6–9 సెం.మీల మధ్య వర్షపాతం నమోదైన మండలాలు
సత్తుపల్లి 7.82
పినపాక 6.66
ముల్కలపల్లి 6.00
3–6 సెం.మీ. మధ్య వర్షపాతం నమోదైన మండలాలు
పెనుబల్లి 5.34
చండ్రుగొండ 5.24
భద్రాచలం 4.94
దమ్మపేట 4.68
వెంకటాపురం 4.52
దుమ్ముగూడెం 4.52
వేంసూరు 3.30
కూసుమంచి 3.24
1–3 సెం.మీ. మధ్య వర్షపాతం నమోదైన మండలాలు
కల్లూరు 2.88
అశ్వాపురం 2.80
ముదిగొండ 2.78
బూర్గంపాడు 2.46
పాల్వంచ 2.38
చర్ల 2.28
వాజేడు 2.22
నేలకొండపల్లి 1.92
అశ్వారావుపేట 1.88
కొత్తగూడెం 1.76
మణుగూరు 1.66
జూలూరుపాడు 1.28
ఏన్కూరు 1.02
గుండాల 1.00
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––
మూడు మండలాల్లో వర్షం కురవలేదు. మిగిలిన 13 మండలాల్లో ఒక సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––