నెల్లూరు(సెంట్రల్): రాజ్యసభ సీట్ల విషయంలో బీసీలను పక్కన పెట్టి కోట్ల రూపాయలు ఇచ్చిన వారికే సీట్లు కేటాయించడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిశేషు పేర్కొన్నారు. నెల్లూరులోని ఓ హోటల్ లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల ఓట్లతో గద్దెనెక్కిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారినే చులకన చేసి చూడడంపై రాష్ట్రంలోని బీసీలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారని చెప్పారు. త్వరలోనే బీసీల సత్తా ఏంటన్నది చంద్రబాబుకు చూపిస్తామని హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య త్వరలోనే జిల్లాలో పర్యటిస్తారని వెల్లడించారు. ఆ సందర్భంగా బీసీల సమస్యలపై పెద్ద ఎత్తున సర్కారుకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. బీసీలు ఆగ్రహిస్తే బాబు ప్రభుత్వం కదులుతుందని హెచ్చరించారు. బీసీల కోసం తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయడానికి ఆర్.కృష్ణయ్య సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.