ఆలేరును డివిజన్‌గా మార్చాలని రాస్తారోకో
ఆలేరును డివిజన్‌గా మార్చాలని రాస్తారోకో
Published Sat, Sep 3 2016 9:29 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
ఆలేరు : పట్టణంలో మూసివేసిన రైల్వేగేట్‌ను తెరిపించాలని, ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఈ మేరకు శనివారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హన్మకొండ–హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకోతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఆందోళనకారులు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైల్వేగేట్‌ను తెరిపించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే విషయం తెలుసుకున్న సీఐ రఘువీర్‌రెడ్డి, పలువురు ఎస్సైలు తమ పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ జనగాం ఉపేందర్‌రెడ్డి, నీలం పద్మ, కొలుపుల హరినాథ్, కె సాగర్‌రెడ్డి, మంగ నర్సింహులు, జూకంటి ఉప్పలయ్య, ఎక్బాల్, ఎజాజ్, గోద శ్రీరాములు, కావటి సిద్ధిలింగం, తునికి దశరథ, జంపాల శ్రీనివాస్, పసుపునూరి విరేశం, ఐడియా శ్రీనివాస్, రాచకొండ జనార్దన్, చామకూర అమరేందర్‌రెడ్డి, గాదపాక దానయ్య, భీజని మధు, అప్సర్ పాల్గొన్నారు.
సీఐతో వాగ్వాదం...
రాస్తారోకో సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత దిష్టిబొమ్మను దహనం చేసేందుకు అఖిలపక్ష నాయకులు ప్రయత్నించగా వారిని యాదగిరిగుట్ట సీఐ అడ్డుకున్నారు. దీంతో కొందరు నాయకులు రహదారిపైకి దిష్టిబొమ్మను తీసుకువచ్చి దహనం చేస్తుండగా అడ్డుకోబోయారు. ఈ క్రమంలో ఎం.డి సలీం, చెక్క వెంకటేశ్, తునికి దశరథ అనే కార్యకర్తలు కిందపడిపోవడంతో స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో ఆందోళనకారులు సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, గాయపడిన నాయకులను ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రిలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పరామర్శించారు.
Advertisement
Advertisement