రేషన్ షాపుల్లో నగదు రహితం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లోని రేషన్ షాపుల్లో నగదు రహిత లావాదేవీలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే నగర శివారులోని జిల్లాల్లో నగదు రహిత లావాదేవీలు ప్రారంభమవడంతో ఇక్కడ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులు, డీలర్లతో సమావేశమై నగదు రహిత లావాదేవీలపై చర్చించారు. ముందుగా రేషన్ సరుకులతో పాటు వివిధ శాఖల బిల్లులు, చార్జీలు వసూళ్లు చేసే బాధ్యతలను డీలర్లకు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే ఈ–పోస్ యంత్రాల ద్వారా సరుకుల పంపిణీ కొనసాగుతోంది. అయితే ప్రస్తుతమున్న ఈ యంత్రాలకు తోడు స్వైపింగ్ మిషిన్లను అందించాలా? లేదా ఈ–పోస్ యంత్రాల్లోనే కొత్త సాఫ్ట్‌వేర్ అమర్చడం సాధ్యమేనా? అన్న అంశంపై అధికారులు నిపుణలతో చర్చిస్తున్నారు. త్వరలో ఒక నిర్ణయం తీసుకొని నగదు రహిత లావాదేవీలు ప్రారంభించాలని యోచిస్తున్నారు.
తొలివిడతలో సర్కిల్‌కు ఒకటి...
గ్రేటర్‌లో సుమారు 12 సర్కిళ్లు ఉండగా సుమారు 1,545 పైగా చౌక ధరల దుకాణాలున్నాయి. అయితే తొలివిడతలో సర్కిల్‌కు ఒక దుకాణం చొప్పున ఈ నగదు రహిత లావాదేవీలకు శ్రీకారం చుట్టాలని అధికారులు భావిస్తున్నారు.