తవ్వేకొద్దీ అవినీతి | Ratnagiri watershed correption | Sakshi
Sakshi News home page

తవ్వేకొద్దీ అవినీతి

Published Tue, May 2 2017 12:46 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

తవ్వేకొద్దీ అవినీతి - Sakshi

తవ్వేకొద్దీ అవినీతి

  •  రత్నగిరి వాటర్‌షెడ్‌లో అక్రమాలు ఎన్నెన్నో
  • రూ.79 లక్షల అవినీతి జరిగిందని మొదట్లో ఫిర్యాదు
  • ప్రాజెక్ట్‌ అధికారులపై క్రిమినల్‌ కేసులు..అరెస్ట్‌
  • మొత్తం రూ.2.02 కోట్లు దుర్వినియోగమైనట్లు తాజాగా బహిర్గతం
  • గుడ్డగుర్కి పంచాయతీలోనే రూ.1.67 కోట్ల అవినీతి
  • అనంతపురం టౌన్‌ : 

    రొళ్ల మండలంలోని రత్నగిరి మెగా వాటర్‌షెడ్‌లో తవ్వేకొద్దీ అవినీతి బయటపడుతోంది. సామాజిక తనిఖీల్లో వెల్లడైన అవినీతి మొత్తం రూ.1.80 కోట్లు. నిందితులపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి రికవరీ చేసేందుకు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న మొత్తం రూ.79 లక్షలు. తాజాగా ఈ ‘లెక్క’ మారింది.  ఏకంగా రూ.2.02 కోట్లు దుర్వినియోగమైనట్లు డ్వామా అధికారులు రొళ్ల పోలీస్‌స్టేషన్‌లో మరోసారి ఫిర్యాదు చేశారు. 

    అసలేం జరిగిందంటే..

    2009–10 ఆర్థిక సంవత్సరంలో మొదటి బ్యాచ్‌ కింద  రత్నగిరి మెగా వాటర్‌షెడ్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభమైంది. దీన్ని ఫోర్డ్‌ స్వచ్ఛంద సంస్థ చేపట్టింది. ప్రాజెక్టు కాల వ్యవధి ఏడేళ్లు. గత ఏడాది సెప్టెంబర్‌లో ముగిసింది. ఈ ప్రాజెక్టు కింద రత్నగిరి, కాకి, దొడ్డేరి, గుడ్డగుర్కి పంచాయతీల్లో మైక్రో వాటర్‌షెడ్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం రూ.10.52 కోట్లు ఖర్చు చేశారు. పనుల్లో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారు. కూలీలతో చేయించాల్సిన ఫారంపాండ్లను యంత్రాలతో తవ్వించారు. చెక్‌డ్యాంలకు మరమ్మతు చేసినట్లు రికార్డుల్లో చూపి బిల్లులు దిగమించారు. పండ్లతోటల పెంపకం చేపట్టకుండానే నిధులు స్వాహా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాటర్‌షెడ్‌ కమిటీల ముసుగులో తెలుగు తమ్ముళ్లు అందినకాడికి దోచుకున్నారు. ఇందుకు అధికారులు సైతం ‘మామూలు’గా సహకరించారు. 2014–16 మధ్యకాలంలో ప్రాజెక్టు పరిధిలో జరిగిన పనులపై సామాజిక తనిఖీలు చేపట్టగా.. విస్తుపోయే నిజాలు బహిర్గతమయ్యాయి. గుడ్డగుర్కి పంచాయతీలో రూ.60 లక్షలు, రత్నగిరి రూ.60 లక్షలు, దొడ్డేరి రూ.30 లక్షలు, కాకి పంచాయతీలో రూ.30 లక్షలు దుర్వినియోగమైనట్లు  గుర్తించారు. దీనిపై నివేదిక అప్పటి కలెక్టర్‌ కోన శశిధర్‌ వద్దకు చేరగా ఆయన సీరియస్‌గా పరిగణించారు. బాధ్యులపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ బదరీష్, ఏపీఓ లక్ష్మణమూర్తి, వాటర్‌షెడ్‌ సిబ్బంది మహాలింగప్ప, బాలాజీ, నరసింహమూర్తిపై రొళ్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. రూ.1.80 కోట్ల అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీలో తేలినా.. ఫిర్యాదులో మాత్రం రూ.79 లక్షలు పేర్కొన్నారు. అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చాక నిందితులు పరారయ్యారు. వారిని పోలీసులు ఇటీవలే అరెస్ట్‌ చేశారు. 

    తాజాగా రూ.2.2 కోట్లు..

    రత్నగిరి వాటర్‌షెడ్‌ పరిధిలో అవినీతిపై  సమగ్ర విచారణ చేస్తే పెద్దఎత్తున నిధుల దుర్వినియోగం వెలుగులోకి వస్తుందని పేర్కొంటూ ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఫారంపాండ్లు, కొత్త చెక్‌డ్యాంలు, చెక్‌డ్యాం మరమ్మతులు, టీడీపీ నేతలు చేపట్టిన పనులపై ఇచ్చిన ఈ కథనాలు సంచలనం సృష్టించాయి. నిందితులను కాపాడేందుకు జరుగుతున్న లోగుట్టు వ్యవహారాన్ని కూడా ఎత్తిచూపింది. ఇందుకు స్పందించిన అప్పటి కలెక్టర్‌ కోన శశిధర్‌ ఏకంగా సదరు సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే  2014–15 బ్యాచ్‌ కింద ‘ఫోర్డ్‌’ సంస్థకు అగళి మండలంలో మంజూరైన ‘రావుడి’ వాటర్‌షెడ్‌ ప్రాజెక్టును రద్దు చేసి మడకశిర డబ్ల్యూసీసీ (వాటర్‌షెడ్‌ కంప్యూటర్‌ సెంటర్‌)కు బదలాయించారు. ఈ నేపథ్యంలోనే ‘రత్నగిరి’ అక్రమాలపై ఇంటెలిజెన్స్‌ సైతం దృష్టి పెట్టింది. కలెక్టర్‌ ప్రత్యేకంగా విచారణ చేయించారు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం అవినీతి ‘లెక్క’ను పెంచారు. గతంలో రూ.79 లక్షలు దుర్వినియోగమైనట్లు  పేర్కొన్న అధికారులు దానికి మరింత జోడించి రూ.2.02 కోట్ల అవినీతి జరిగినట్లు ఫిర్యాదు చేశారు. రత్నగిరి మైక్రో వాటర్‌షెడ్‌లో రూ.68,683, కాకిలో రూ.20,28,407, దొడ్డేరిలో రూ.14,06,186, గుడ్డగుర్కిలో రూ.1,67,31,170 దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తంగా రూ.2,02,34,446 దుర్వినియోగమైందని తేల్చారు.

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement