- ఘోల్లుమంటున్న అపార్టుమెంట్ల బిల్డర్లు
- కొనేందుకు ముందుకు రాని తీరు
- 1400 ప్లాట్లకు అనుమతులు
- ఖాళీగా ఉన్న ప్లాట్లు
గుడివాడలో రియల్ వ్యాపారం ఢమాల్ మంది. అపార్టుమెంట్లపై ఉద్యోగ, వ్యాపారులు మక్కువ చూపడం లేదు. నిర్మించినవన్నీ ఖాళీగా ఉంటున్నాయి. ప్లాట్లు అమ్ముడుపోక బిల్డర్లు బోరున విలపిస్తున్నారు. ప్రస్తుతం కట్టినవి, కట్టేందుకు అనుమతి ఉన్నవి పట్టణంలో దాదాపు 1400 ప్లాట్లు ఉన్నాయి. వీటిలో కేవలం 200 కూడా అమ్ముడు పోలేదని సమాచారం. కొత్తగా నిర్మాణం చేపట్టాలని ముందుకొస్తున్న బిల్డర్లు కట్టాలా? వద్దా? అని మీమాంసలో పడ్డారు.
గుడివాడ: పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చతికిలపడింది. అపార్టుమెంట్లు కట్టిన వారు అమ్ముడు పోక బిల్డర్లు ఇబ్బందులు పడుతున్నారు. రాజధాని నగరానికి అతి దగ్గరలో గుడివాడలో వ్యాపారం బాగుంటుందని ఆశపడ్డారు. పూర్తయిన ప్లాట్లు అమ్ముడుపోక నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే ఆర్థిక స్తోమత గలవారు అపార్టమెంట్లు, స్థలాలు కొనుగోలు చేయటంతో ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.
పట్టణ పరిసర ప్రాంతాల్లో...
గుడివాడ పట్టణం, పరిసర ప్రాంతాల్లో 1400 ప్లాట్లుకు అనుమతులు వచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఒక్క విజయవాడ రోడ్డులోనే 300 ప్లాట్లు నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణం పూర్తి అయినవి ఉన్నాయి. గుడివాడ వలివర్తిపాడు బైపాస్ రోడ్డులో 600 ప్లాట్లుతో అపార్టుమెంట్లు ఉన్నట్లు సమాచారం.
ఇవిగాక గుడివాడ పట్టణం లోపల, ఏలూరు రోడ్డు, పామర్రు రోడ్డులలో అనేక అపార్టుమెంట్లు నిర్మాణంలో ఉన్నాయి. అపార్టుమెంట్లు ద్వారా భారీ ఎత్తున సొమ్ముచేసుకుందామనుకున్న బిల్డర్లు వ్యాపారాలు లేకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. గుడివాడ బైపాస్‌రోడ్డులో కట్టిన ఓ అపార్టుమెంటులో 165 ప్లాట్లుకు గాను ఇప్పటి వరకు 30 ప్లాట్లు అమ్మినట్లు వినికిడి. విజయవాడ రోడ్డులో ఓ బిల్డరు విస్తృతమైన ప్రచారం చేసినా సగం కూడా అమ్ముడవలేదు. అనేక చోట్ల ఇదే పరిస్థితితో బిల్డర్లు తలలు పట్టుకుంటున్నారు. బ్యాంకుల్లో రుణాలు తెచ్చి భవనాలు నిర్మిస్తే అమ్ముడు పోకపోవటంపై అయోమయం నెలకొంది.
మేకపోతు గాంభీర్యం..
ఎవరైనా కొనుగోలుదారుడు వెళితే ప్లాట్లు అన్నీ అమ్మేశామని ఒకటి, రెండు మాత్రమే ఉన్నాయని బిల్డర్లు బిల్డప్ ఇవ్వటం సర్వసాధారణంగా మారింది. ఏ అపార్టుమెంటులోనూ కనీసం 20 శాతం కూడా అమ్ముడు కాలేదని తెలుస్తోంది. అపార్టుమెంట్లు కొనుగోలుకు భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు, ధనవంతులు ఇష్టపడుతుంటారు. కొంత మంది బ్యాంకు రుణాలతో కొనుగోలు చేస్తారు. గుడివాడ పెద్దగా ఉద్యోగ వర్గాలు లేని ప్రాంతం. కొత్తగా కొనుగోలు చేసేవారు తగ్గారని చెబుతున్నారు. ఏదేమైనా ఇదే పరిస్థితి కొనసాగితే బిల్డర్లకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.