తగ్గిన భక్తుల ర ద్దీ
తగ్గిన భక్తుల ర ద్దీ
Published Wed, Aug 17 2016 12:32 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరుసగా వచ్చిన సెలవులు ముగియడంతో మంగళవారం జిల్లాలో కృష్ణా పుష్కరాలు కళ తప్పాయి. ఐదోరోజు కేవలం 2లక్షలకు పైచిలుకు మందే జిల్లాలోని 28 ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించారు. అది కూడా సాగర్, వాడపల్లి, మట్టపల్లిలో మాత్రమే 2లక్షల మందికి పైగా స్నానాలు చేయగా, మిగిలిన అన్ని చోట్లా కలిపి 40వేలు దాటలేదు. ఎంత బాగా లెక్క వేసినా భక్తుల సంఖ్య రెండున్నర లక్షలు దాటి ఉండదని అధికారులే చెబుతున్నారు. ఇక, ఎప్పటిలాగే సాగర్ శివాలయం ఘాట్‌కు భక్తులు పోటెత్తారు. అక్కడ 80వేల మంది, సురికి వీరాంజనేయస్వామి ఘాట్‌లో 20వేల మంది వరకు స్నానాలు చేసినట్లు అంచనా. మట్టపల్లిలో 50వేలు, వాడపల్లిలో 50వేల పైచిలుకు, నేరేడుచర్ల మహంకాళిగూడెం ఘాట్‌లో 15వేలు, పానగల్‌లో 15వేల మంది స్నానాలు చేశారు. బ్యాక్‌వాటర్‌లో ఉన్న చందంపేట మండలం కాచరాజుపల్లి, పెదమునిగల్, పీఏపల్లి మండలం అజ్మాపురం ఘాట్లకు భక్తులు వందల సంఖ్యలోనే వచ్చారు. మేళ్లచెరువు మండలంలోనూ అదే పరిస్థితి. ఇక, దర్వేశిపురంలో కొంత మెరుగనిపించినా, కనగల్ ఘాట్‌లో ప్రారంభమైనప్పటినుంచి ఐదోరోజు తొలిసారి 500 మంది స్నానాలు చేశారు. కానీ, మట్టపల్లి మార్కండేయ ఘాట్‌లో మాత్రం ప్రారంభం కాలేదు. సాగర్, వాడపల్లి, మట్టపల్లి తప్ప మిగిలిన చోట్ల పెద్దగా తాకిడి లేకపోవడంతో అధికారుల్లో కూడా ఉత్సాహం తగ్గింది.
విహంగ వీక్షణం
జిల్లాలో జరుగుతున్న కృష్ణా పుష్కరాలను మంగళవారం మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. ఉదయం హైదరాబాద్ నుంచి నల్లగొండకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన మంత్రులు మేకల అభినవ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పానగల్, దర్వేశిపురం ఘాట్లను సందర్శించారు. అక్కడి నుంచి మళ్లీ నల్లగొండకు వచ్చి హెలికాప్టర్‌లో నాగార్జునసాగర్‌కు వెళ్లారు. అక్కడ వీఐపీ ఘాట్‌లో ఏర్పాట్ల గురించి అధికారులు, భక్తులతో ఆరా తీశారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లోనే వాడపల్లి, మట్టపల్లి ఘాట్లకు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ మీడియాతో మాట్లాడిన మంత్రులు జిల్లాలో పుష్కరాల ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు. అందరూ చిత్తశుద్ధితో పనిచేస్తున్న కారణంగా పుష్కరాలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 20న మట్టపల్లికి గవర్నర్ నరసింహన్ వచ్చి పుష్కర స్నానం చేస్తారని చెప్పారు.
మీడియాపై మళ్లీ ఆంక్షలు
పుష్కరాలు ప్రారంభమైన రెండు రోజుల పాటు కఠిన నిబంధనలు అమలు చేసి భక్తులను ఇబ్బందుల పాలు చేసిన పోలీసులు ఆ తర్వాతి రెండు రోజులు మాత్రం భక్తులపై ఆంక్షలు తొలగించారు. ఘాట్ల సమీపం వరకు అనుమతించడంతో మహిళలు, పిల్లలు, వృద్ధులు కొంత ఉపశమనం పొందారు. కానీ, ఐదోరోజు మంగళవారం మాత్రం నాగార్జునసాగర్ పోలీసులు కొంత నిబంధనలను కఠినతం చేశారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎప్పటిలాగే భక్తులు కిలోమీటర్ల మేర నడవాల్సి వచ్చింది. ఇక, జర్నలిస్టులను అయితే పోలీసులు చాలా ఇబ్బందులు పెట్టారు. ముఖ్యంగా మీడియా ప్రతినిధులు లైవ్ కవరేజ్ చేసేందుకు కూడా అంగీకరించలేదు. ఉదయం ఆరుగంటల నుంచే ప్రెస్ పాసులు చూపించినా వదిలిపెట్టకుండా మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు. విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లడంతో పాసులున్న వారిని ఘాట్ల వరకు అనుమతించాలని ఆదేశాలిచ్చారు. ఆ ఆదేశాలను కొద్దిసేపే పాటించిన పోలీసులు మంత్రులు సాగర్ నుంచి వెళ్లిపోగానే మళ్లీ యథావిధిగా నిబంధనలు విధించారు. దీంతో మీడియా ప్రతినిధులు రోడ్డుపై నిరసనలకు దిగాల్సి వచ్చింది. తర్వాత డీఎస్పీ జోక్యం చేసుకుని పరిస్థితిని శాంతింపజేశారు. ఎస్పీ కార్యాలయం కూడా జర్నలిస్టులపై ఆంక్షలు తొలగిస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది.
Advertisement