పేరు మార్పిడి ఇక ఈజీ
ఆస్తుల రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే మ్యుటేషన్
15 రోజుల్లోనే.. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో అమలు
గజ్వేల్: మున్సిపాలీటీలు, నగర పంచాయతీల్లో ఇళ్ల పేరు మార్పిడి ఇక సులభతరం కానుంది. ఇళ్ల కొనుగోలు సందర్భంగా జరిగే రిజిస్ట్రేషన్ ప్రక్రియతోపాటే మ్యూటేషన్ చేపట్టనున్నారు. గతంలో మాదిరిగా ఈ విచారణ పేరిట నెలల తరబడి పెండింగ్‌లో ఉంచకుండా...15రోజుల్లోపే పేరు మార్పిడి చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి..
జిల్లాలో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, జహీరాబాద్, పటాన్‌చెరు మున్సిపాలీటీలతోపాటు గజ్వేల్, దుబ్బాక, జోగిపేట నగర పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ ఇళ్ల పేరు మార్పిడి వివాదాస్పదంగా మారుతున్నది. ఇళ్ల కొనుగోలు కోసం రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత పేరు మార్పిడి (మ్యూటేషన్) కోసం రూ.500 డీడీ చెల్లించి కొనుగోలుదారులు మున్సిపాలీటీలు, నగర పంచాయతీల్లో దరఖాస్తు చేసుకునేవారు.ఈ విధంగా వచ్చిన అర్జీలను నగర పంచాయతీ సిబ్బంది విచారణ పేరిట పేరు మార్పిడికి చాలా సమయం తీసుకునే వారు. ఈ వ్యవహారంలో ముడుపులు కూడా సమర్పించుకోవాల్సి వచ్చేంది.
మొత్తానికి కొనుగోలుదారులు మ్యూటేషన్ కోసం నెలల తరబడి మున్సిపల్ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టేవారు. ఈ విధానానికి స్వస్తి పలికి పేరు మార్పిడి విధానాన్ని సులభతరం చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. కొత్త విధానంలో కొనుగోలుదారుడు రిజిస్ట్రేషన్ సందర్భంగానే మ్యూటేషన్ కోసం సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలోనే రూ.500 డీడీ రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఫలితంగా...కొనుగోలుదారు, అమ్మకందారుల వివరాలు మున్సిపల్ కార్యాలయాలకు ఆన్‌లైన్ ద్వారా అందుతాయి. ఆ తర్వాత మ్యూటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మూడు స్థాయిల్లో విచారణ వేగంగా సాగుతుంది.
ఇందులో సంబంధిత విభాగం సిబ్బంది, అధికారులు ప్రత్యక్ష పరిశీలన జరిపి కమిషనర్‌కు నివేదిస్తారు. ఆ తర్వాత కమిషనర్ ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత మీ-సేవ కేంద్రాల్లో మ్యూటేషన్ సర్టిఫికెట్ అందుబాటులోకి వస్తుంది. ఇదంతా 15రోజుల్లోపు పూర్తవుతుంది. కొత్త విధానానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటికే జిల్లాలోని మున్సిపాలీటీలు, నగర పంచాయతీలకు అందాయి. గజ్వేల్ నగర పంచాయతీ కమిషనర్ శంకర్ మార్గదర్శకాల విషయాన్ని ధ్రువీకరించారు.