నోరువిప్పుతున్న చింటూ?
పెరగనున్న నిందితుల సంఖ్య
ఇప్పటికే పోలీసుల అదుపులో ఎనిమిది మంది
హత్య కుట్ర తెలిసిన వారిపై కేసులు షురూ
బయటపడుతున్న పెద్దల భాగోతం
మేయర్ దంపతుల హత్య కేసు
చిత్తూరు (అర్బన్): మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్య కేసులో చింటూ పోలీసుల ఎదుట నోరు విప్పుతున్నాడా..? హత్య కుట్రలో ఎవరెవరు ఉన్నారు..? ఎవరికి ముందే తెలుసు..? అనే వివరాలు చెబుతున్నాడా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. పోలీసుల కస్టడీలో ఉన్న చింటూ మేయర్ హత్య ఘటనపై పలు విషయాలు పూసగుచ్చినట్లు చెప్పినట్టు సమాచారం. ఆ వివరాల ఆధారంగా పోలీసులు ఇప్పటికే ఎనిమిది మంది ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. వారికి హత్య కుట్రలో ఏ మేరకు సంబంధాలున్నాయనే విషయం నిర్ధారించుకున్న తర్వాత కేసులు నమోదు చేయడానికి పోలీసులు సమాయత్తమవుతున్నారు.
పెరగనున్న నిందితుల సంఖ్య...
గత నెల 17న చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన మేయర్ దంపతుల జంట హత్య కేసులో పోలీసులు ప్రాథమికంగా 11 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడిగా చింటూ, ఇతర నిందితులుగా వెంకటాచలపతి, జయప్రకాష్, మంజునాథ్, వెంకటేష్, మురుగ, యోగ, పరంధామ, హరిదాస్, మొగిలి, శశిధర్ ఉన్నారు. మొగిలి, వెంకటేష్‌ను ఇంకా అరెస్టు చేయలేదు. చింటూ చెబుతున్న విషయాల ఆధారంగా నిందితుల సంఖ్య పెరగనుందని కేసును విచారిస్తున్న పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
అందరినీ అరెస్టు చేయబోమని, హత్య కుట్రలో పాలు పంచుకున్నవారు, కుట్ర విషయం ముందుగానే తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వని వారు ఎవరెవరు ఉన్నారో తెలుసుకుని సాక్ష్యాలు సేకరిస్తామని, అనంతరం కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు చింటూను 15 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు బుధవారం ఇతన్ని చిత్తూరు నగరంలోని ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారించారు. కస్టడీ గడువు పూర్తయ్యేంత వరకు ఇతన్ని తమ వద్దే ఉంచుకుని తరువాత కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన తొమ్మిది మంది నిందితులను విచారించిన తరువాత సజ్ జైలులో, జిల్లా జైలులో ఉంచాలి. వీళ్లందరినీ ఒకే చోట ఉంచినా ఒకరికి ఒకరు తారసపడకుండా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.